Begin typing your search above and press return to search.

వివేకవంతమైన నిర్ణయమంటే..!

By:  Tupaki Desk   |   26 Jun 2015 5:30 PM GMT
వివేకవంతమైన నిర్ణయమంటే..!
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ రీ ట్వీటు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి 40 ఏళ్లయిందని, అప్పటి నాయకత్వం ప్రజలను ఉక్కుపాదం కింద మోపిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దానికి జవాబుగా.. 40 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ ఇప్పుడిప్పుడే స్వేచ్ఛాగాలులను పీల్చుకుంటోందని, వివేకంతో వ్యవహరిస్తారని, చరిత్రను పునరావృతం చేయబోరని ఆశిస్తున్నానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఇక్కడ వివేకంతో వ్యవహరించడం అంటే ఏమిటి అనే ప్రశ్నను ఇప్పుడు రాజకీయ వర్గాలు వేస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోనే సెక్షన్‌ 8ని యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై అప్పట్లో లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరిగింది. దానికి అప్పట్లో అన్ని రాజకీయ పక్షాలూ అంగీకరించాయి కూడా. ఇప్పుడు దీనిని అమలు చేయాలని సీమాంధ్ర పార్టీలు కోరుతున్నాయి. అమలు చేయరాదని టీఆర్‌ఎస్‌ పట్టుబడుతోంది. చట్టాన్ని యథాతథంగా అమలు చేయడం వివేకవంతంగా వ్యవహరించడం అవుతుందా? పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని తుంగలోకి తొక్కి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వివేకవంతంగా వ్యవహరించడం అవుతుందా? అనే ప్రశ్నలను న్యాయ నిపుణులు వేస్తున్నారు. ఇంతకీ, చట్టాన్ని అమలు చేయాలని కేటీఆర్‌ ఆ ట్వీటు చేశారా లేక చట్టాన్ని అమలు చేయవద్దని ట్వీటు చేశారా? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

సెక్షన్‌ 8ని అమలు చేయకపోతే చట్టాన్ని కూడా తుంగలోకి తొక్కి ఎమర్జెన్సీ తరహాలో వ్యవహరించారని, మోదీ ప్రభుత్వం వివేకవంతంగా నిర్ణయం తీసుకోలేదని, యూపీఏకు ఉన్న వివేకం కూడా ఎన్డీయేకు లేదని సీమాంధ్రులు విమర్శిస్తారు. యూపీఏ ప్రభుత్వం చట్టంలో పేర్కొన్న సెక్షన్‌ను అమలు చేయరాదని తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్వీటు.. దానిపై మోదీ ఎటువంటి చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ న్యాయ నిపుణుల్లో రేకెత్తింది.