Begin typing your search above and press return to search.

ఏపీపై కేటీఆర్ మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   2 Nov 2016 4:12 AM GMT
ఏపీపై కేటీఆర్ మాట‌లు విన్నారా?
X
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో తెలంగాణ-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా మొద‌టి స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ‌లో అయితే ఇది తార‌స్థాయిలో ఉంది. ఎందుకంటే గ‌త ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఏకంగా ఒక‌టో స్థానానికి ఎగ‌బాకింది. ఈ ప‌రిణామంపై సీఎం కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ - పరిశ్ర‌మ‌ల‌ శాఖామంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం అమలుచేస్తున్న సంస్కరణల వల్లనే సులభ వాణిజ్య ర్యాంకుల్లో తెలంగాణకు అగ్రస్థానం లభించిందని చెప్పారు. రాష్ట్రంగా ఏర్పడిన రెండు సంవత్సరాల కొద్ది నెలల వ్యవధిలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల‌కు ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. సులభ వాణిజ్యానికి సంబంధించి పరిశ్రమల రంగంలో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మార్గదర్శకత్వం - సంస్కరణల ఫలితమేనని అన్నారు.

కేంద్రం నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనాలనే ఉద్దేశంతో కాకుండా పారిశ్రామికరంగం అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణలకు తెరలేపారని, పోటీ ప్రారంభానికి ముందే సంస్కరణలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోటీలోని పలు అంశాలను ఏపీ కాపీ కొట్టడంపై ప్రస్తావించారు. "మేథో సంపత్తి హక్కులను కాపీ కొట్టారనే కోణంలో ఫిర్యాదు చేశామే తప్ప కేవలం ఏపీ రాష్ట్రమనే దృష్టితో కాదు. ఎంత కాదన్నా సాటి తెలుగు రాష్ట్రం.. మన సోదర రాష్ట్రం.. ఒకవేళ ఒకటో స్థానాన్ని ఏదైనా రాష్ట్రంలో కలిసి పంచుకునే అవకాశం వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ నే మేం కోరుకునే వాళ్లం" అని కేటీఆర్ స్పష్టంగా తెలిపారు. "సమస్య అనేది మేథో సంపత్తికి సంబంధించింది. ఈ మేథో సంపత్తిని రక్షించుకోకపోతే పారిశ్రామీకరణ దెబ్బతింటుంది. అందుకే ఫిర్యాదు చేశాం"అని వివరించారు.

పెట్టుబడులు - పరిశ్రమల అనుమతుల్లో అవినీతి ఉందని కొందరు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంపై కేటీఆర్ మాట్లాడుతూ.."ఏనుగు పోతుంటే.. అనేవాళ్ళు అంటూనే ఉంటారు" అని ఎద్దేవాచేశారు. "నైతికత - సహేతుకం అయితే చెప్పమనండి. ఆధారసహితంగా చూపిస్తే.. తప్పకుండా పరిశీలిస్తాం. మా ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ మంచి మార్పును చూపించింది. ఆఖరికి దేశ ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడుకూడా సీఎం కేసీఆర్‌ ను పొగిడారు. ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏం కావాలి. నిరాధారంగా ఆరోపణలు చేసేవారి విజ్ఞతకు - అజ్ఞానానికి బాధపడుతున్నాను. ఇలాంటి కామెంట్లు వారి విజ్ఞతకే వదిలేద్దాం"అంటూ మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర పునర్వస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి వస్తున్నాయని - మరిన్ని రావాల్సినవికూడా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/