Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ రావు గురించి కేటీఆర్ చెప్పిన నిజం

By:  Tupaki Desk   |   31 Dec 2015 7:20 AM GMT
హ‌రీశ్‌ రావు గురించి కేటీఆర్ చెప్పిన నిజం
X
తెలంగాణ రాష్ర్ట స‌మితిలో, తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వంలో వార‌స‌త్వ‌ పోరు, పైచేయి సాధించుకోవాల‌నే త‌ప‌న‌తో ఎత్తులు, కార్యాచ‌ర‌ణ‌లు సాగుతున్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. పార్టీ త‌ర‌ఫున జ‌రిగే ఏ కార్య‌క్ర‌మం అయినా ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. అయితే తాజాగా ఈ గేమ్‌ లో టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ వేగం పెంచారు. హ‌రీశ్‌ పై పై చేయి సాధిస్తున్నారు. ఇదే విష‌యమై కేటీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావిస్తే ఆయ‌న‌ ఎంత అమాయ‌కంగా స‌మాధానం ఇచ్చాడో చూడండి.

టీఆర్ ఎస్‌ లో నంబ‌ర్ వ‌న్ కోసం కేటీఆర్ వ‌ర్సెస్ హ‌రీశ్ అనే వాతావ‌ర‌ణం ఉంది క‌దా అనే ప్ర‌శ్న‌కు కేటీఆర్ స్పందిస్తూ "టీఆర్‌ ఎస్‌ లో ఏ నంబర్లూ లేవు. ఉన్నదొకటే నంబర్. అది కేసీఆర్. మిగతావారికి ఏ నంబర్లూ లేవు. దీన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. మంత్రి హరీశ్‌ రావుతోనూ ఎలాంటి ఆధిపత్య పోరూ లేదు" అని అన్నారు. పోనీ ఈ ప్ర‌చారం ఎందుకు జ‌రుగుతోంద‌ని ప్ర‌శ్నిస్తే.. "టీడీపీ - కాంగ్రెస్ పతనపు అంచున ఉన్నాయి. అందుకే ఈ పనికిమాలిన ప్రచారం చేస్తున్నాయి. మా మధ్య ఏమీ లేదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండబోదు" అంటూ ఘంటాప‌థంగా చెప్పారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ను కూడా కేటీఆర్ ప్ర‌స్తావించారు. 'వరంగల్ ఉప ఎన్నిక‌లో స‌మ‌ష్టిగా పని చేశాం. ఇపుడు జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో గెలవాలి. వరంగల్ - ఖమ్మం కార్పొరేషన్లు గెలవాలి. సమష్టిగా పని చేస్తం. అందరం పని చేస్తం' అంటూ తెలివిగా స్పందించారు.

అయితే స‌మాధానాలు ఆస‌క్తిక‌రంగానే ఉన్నా వ‌రంగ‌ల్ ఉప‌ ఎన్నిక విష‌యంలోనూ హ‌రీశ్‌ ను దూరం పెట్టిన విష‌యం తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ కేంద్రంగా సాగుతున్న గ్రేట‌ర్ హ‌డావుడిలో కేటీఆర్ త‌ప్ప హ‌రీశ్ ఎక్కడైనా క‌నిపిస్తున్నాడా? లేనే లేదు. కానీ ఈ నిజం తెలిసిన‌ప్ప‌టికీ కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా స్పందించి ఘ‌టికుడే అనిపించుకున్నాడు.