Begin typing your search above and press return to search.

కరోనా పై దిశా నిర్దేశం చేసిన కేటీఆర్ ...

By:  Tupaki Desk   |   3 March 2020 10:54 AM GMT
కరోనా పై దిశా నిర్దేశం చేసిన కేటీఆర్ ...
X
దుబాయ్ నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా, తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ప్రణాళికలు రచిస్తుంది. కరోనాను కట్టడి చేసే దిశగా... ఈ రోజు అత్యవసర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అన్నారు.

ఈ భేటీలో మంత్రులు కేటీఆర్ - ఎర్రబెల్లి దయాకర్ రావు - ఈటెల రాజేందర్ - ఆరోగ్య శాఖ - వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ..కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కరోనా వైరస్‌ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌ ల తో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని - ఈ కరోనా పై ఎవరైనా తప్పుడు ప్రచారం నిర్వహిస్తే , వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియా తో మాట్లాడుతూ ..శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తొమ్మిది శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తామని - ప్రతి శాఖకు ఒక నోడల్ ఆఫీసర్‌ ను నియమిస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు - నర్సులను సరిపోయేంత మందిని నియమిస్తామన్నారు. అటు.. ఈ వైరస్ పై ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా అన్న అనుమానం వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులను పంపించాలని కోరినట్లు స్పష్టం చేశారు.