Begin typing your search above and press return to search.

ట్వీట్ తో ప్రాణం కాపాడిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   4 Jun 2017 4:35 AM GMT
ట్వీట్ తో ప్రాణం కాపాడిన కేటీఆర్‌
X
కీల‌క ప‌ద‌వుల్లో ఉండే వారు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. మ‌రి..అలాంటి వారి దృష్టికి అత్య‌వ‌స‌ర‌మైన విష‌యాన్ని తీసుకెళ్ల‌టం గ‌తంలో చాలా క‌ష్టంగా ఉండేది. బాగా తెలిసి.. ప‌రిచ‌యం ఉంటే త‌ప్పించి సాధ్య‌మ‌య్యేది కాదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్పుడా ఇబ్బంది తీరిపోయింది. ముక్కు ముఖం తెలీని వారు సైతం.. అత్యున్న‌త స్థానంలో ఉన్న వారి సాయం పొందే వీలు క‌లిగింది. సాంకేతిక‌త అందించిన సౌల‌భ్యాన్ని అందిపుచ్చుకుంటున్న నేత‌లు.. త‌మ ఇమేజ్ ను భారీగా మార్చుకోవ‌ట‌మే కాదు.. తామెంత మ‌న‌సున్న వారిమో చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విష‌యానికే వ‌స్తే.. స‌మ‌స్య‌ల మీద ఆయ‌న స్పందించే తీరు చాలా వేగంగా ఉంటుంది. సాయం అవ‌స‌ర‌మైన వారి విష‌యంలో వెనుకా ముందు చూసుకోకుండా సాయం చేస్తుంటారు. అర్థ‌రాత్రి.. అప‌రాత్రి అన్న‌ది కూడా ఆయ‌న ప‌ట్టించుకోరు. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఇంత వేగంగా స్పందించే అతి త‌క్కువ‌మంది యువ నేత‌ల్లో అత‌నొక‌రిగా చెప్పాలి.

గ‌తంలో రోడ్డు ప్ర‌మాదాల‌కు గురైన వారిని గుర్తించి కాన్వాయ్ ఆపి మ‌రీ కాపాడిన కేటీఆర్‌.. తాజాగా త‌న‌లోని మాన‌వ‌త్వాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.ప్రాణాపాయంతో పోరాడుతున్న యువ‌తికి పెద్ద‌మ‌న‌సుతో సాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని నిలిపిన వైనం తాజాగా చోటు చేసుకుంది. ఒకే ఒక్క ట్వీట్ తో నిమిషాల వ్య‌వ‌ధిలో స్పందించి.. ల‌క్ష‌ల రూపాయిల సాయాన్ని అందించిన వైనం ఇప్పుడు అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటుంది.

రశ్మిత అనే యువ‌తి ఒడిశా నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి కాల్ హెల్త్ సంస్థ‌లో ప‌ని చేస్తున్నారు. జీడిమెట్ల ప్రాంతంలో ఆమె శ‌నివారం ఉద‌యం బ‌స్సులో నుంచి జారి ప‌డి ప్ర‌మాదానికి గుర‌య్యారు. వెంట‌నే ఆమెను సురారంలోని మ‌ల్లారెడ్డి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆమెకు అత్య‌వ‌స‌రంగా ఆప‌రేష‌న్ చేయాల‌ని అందుకు రూ.7ల‌క్ష‌ల వ‌ర‌కూ అవుతుంద‌ని వైద్యులు చెప్పారు.

ఆమెకు.. ఆమె ఫ్యామిలీకి అంత ఆర్థిక స్థోమ‌త లేదు. ఈ విష‌యాన్ని గుర్తించిన ఆమె కంపెనీకి చెందిన స‌హోద్యోగి ఒక‌రు మంత్రి కేటీఆర్‌కు.. ఒడిశా ప్ర‌భుత్వానికి ట్వీట్ చేశారు. వేరే కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్న కేటీఆర్.. ఈ ట్వీట్‌కు వెనువెంట‌నే స్పందించారు. ఆసుప‌త్రికి త‌మ సిబ్బందిని పంపించి.. వెంట‌నే శ‌స్త్ర‌చికిత్స చేయాల‌ని.. అవ‌స‌ర‌మైన సాయాన్ని అందిస్తామ‌ని చెప్పారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం కేవ‌లం అర గంట‌లో పూర్తి కావ‌టం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఒడిశా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. కానీ.. మంత్రి కేటీఆర్ స్పంద‌న‌తో ఆమెకు అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర శ‌స్త్ర‌చికిత్స‌ను చేశారు. మాన‌వ‌తా హృద‌యంతో కేటీఆర్ రియాక్ట్ అయిన తీరుపై సర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుత‌న్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/