Begin typing your search above and press return to search.
కేటీఆర్..కాంగ్రెస్..వంద ఎలుకలను తిన్న పిల్లి
By: Tupaki Desk | 14 March 2018 5:44 AM GMTకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయడం - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలను సెషన్ ముగిసేదాక సస్పెన్షన్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అధికార టీఆర్ ఎస్ పార్టీపై ఎదురుదాడి చేస్తోంది. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి ఇదే అంశంపై బుధవారం ఎమ్మెల్యేలు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కోర్టుకు సమర్పించాలని నిర్ణయించింది. ఇదే అంశాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. మరోవైపు తమను ప్రభుత్వం అన్యాయంగా సభ్యత్వాలను రద్దు, సస్పెన్షన్ల తదితర అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం గాంధీభవన్ ఆవరణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఎమ్మెల్యే సంపత్ కుమార్ 48 గంటలపాటు 'ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహారదీక్ష' చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్ హటావో - తెలంగాణ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు.
విపక్ష నేతలు ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ రథసారథి - ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ లో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నీతులు చెప్పడం సిగ్గుచేటని ఓ ట్వీట్ లో ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 365ని దుర్వినియోగం చేసిన ఘటన ఆ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు .`ఆర్టికల్ 365 ఆధారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అర్ధాంతరంగా రద్దు చేసి ముఖ్యమంత్రులను గద్దె దించిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా` అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నో రాష్ర్టాల ప్రభుత్వాలను అర్ధాంతరంగా దించివేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి చెప్పడం...`వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లుంది` అని ఎద్దేవా చేశారు.