Begin typing your search above and press return to search.

గడ్డం మీద కేటీఆరూ రియాక్ట్ అయ్యారోచ్

By:  Tupaki Desk   |   3 Nov 2016 6:07 AM GMT
గడ్డం మీద కేటీఆరూ రియాక్ట్ అయ్యారోచ్
X
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ గడ్డం తీసే ప్రసక్తే లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మధ్య శపథం చేయటం తెలిసిందే. ఆయన మాటపై ఇప్పటికే పలువురు తెలంగాణ అధికారపక్ష నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆ జాబితాలో చేరారు మంత్రి కేటీఆర్ .తాజాగా వరంగల్ జిల్లా ఓ సభలో మాట్లాడిన‌ సందర్భంగా ఉత్తమ్ వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘ఒకాయన అధికారంలోకి వచ్చే వరకూ గడ్డం తీయనని శపథం చేస్తున్నారు. మంచిదే. కానీ.. గడ్డాలు పెంచితే ముఖ్యమంత్రులు కాలేరు. ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మటం లేదు. వాళ్ల మొహాలు చూసిచూసి విసిగిపోయి కేటీఆర్ కు పగ్గాలు అప్పగించారు. 2001లో ఏర్పడ్డ ఛత్తీస్ గఢ్.. జార్ఖండ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికి నిలదొక్కుకోలేకపోతున్నారు. నిన్నకాక మొన్న ప్రధాని మోడీ నయా రాయ్ పూర్ లో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాంటిది రెండున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోంది. పక్కవాళ్లు ఎన్ని పంచాయితీలు పెడుతున్నా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకువెళుతున్నాం. కొంతమందికి ఇది మింగుడుపడక పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నిసర్వేలు చేసినా.. కేసీఆర్ నెంబరు 1 ముఖ్యమంత్రి అని తేలుతోంది’’ అని చెప్పుకొచ్చారు.

గడ్డాలు పెంచినంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరంటూ కేటీఆర్ చెప్పటం బాగుంది. కానీ.. గడ్డం పెంచుతున్నది అధికారం కోసం కాదని.. అధికారమే లక్ష్యంగా పని చేయటమన్న చిన్న విషయాన్ని కేటీఆర్ గుర్తించనట్లుగా మాట్లాడేయటం చూస్తే.. ఎటకారం చేసుకొని.. విషయాన్ని సింపుల్ గా తీసి పారేయటమనే వ్యూహాంగా కనిపిస్తోంది. సంకల్పంతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయం కేటీఆర్ కు తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చే వరకూ అరగుండుతో ఉన్నోళ్లు ఎంతోమంది. అలాంటి వాళ్లను గతంలో ఎటకారం చేసినోళ్ల నోట ఇప్పుడు మాట రాని పరిస్థితి. అందుకే.. గడ్డంపై మాటలు తొందరపడి అనటమే అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు పవర్ ఉందన్న ధీమాతో మాట్లాడటం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/