Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి కేసీఆర్ 100 కోట్లు ఇవ్వాల‌నుకున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   29 Oct 2018 5:44 AM GMT
అమ‌రావ‌తికి కేసీఆర్ 100 కోట్లు ఇవ్వాల‌నుకున్నార‌ట‌!
X
ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్‌. హైద‌రాబాద్‌ లోని సీమాంధ్రులను మ‌న‌సుల్ని దోచుకునే కార్య‌క్ర‌మాన్ని షురూ చేసిన ఆయ‌న‌.. హైద‌ర‌బాద్‌ లో అత్య‌ధికంగా సీమాంధ్రులు ఉండే ప్రాంతంగా చెప్పే నిజాంపేట‌లో ఆయ‌న ఒక స‌భ‌లో పాల్గొన్నారు. హ‌మారా హైద‌రాబాద్ అంటూ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక విలేక‌రులు వెళ్లిన‌ప్ప‌టికీ.. అక్క‌డ కేటీఆర్ మాట్లాడిన మాట‌లు కార‌ణంగా ఈ రోజు ప్ర‌ధాన ప‌త్రిక‌లు మొద‌టి పేజీలో బ్యాన‌ర్ వార్త‌లుగా అచ్చేయ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ.. అంత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని కేసీఆర్ ఏం చెప్పారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

సీమాంధ్రుల మ‌న‌సులు దోచుకునేలా.. వారిని ఆక‌ట్టుకునేలా కేటీఆర్ మాట్లాడారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వెళ్లిన కేసీఆర్‌.. అమ‌రావ‌తికి రూ.100 కోట్ల సాయాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌క‌టించాల‌ని సిద్ధ‌మ‌య్యార‌ని.. దీనికి త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు చెప్పారు.

అమ‌రావ‌తికి వెళ్లిన కేసీఆర్‌.. అక్క‌డ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శిని పిలిపించుకొని.. అమ‌రావ‌తికి ప్ర‌ధాని ఏం ఇస్తార‌ని ఆరా తీసిన‌ట్లు చెప్పారు. రెండు చెంబుల్లో మ‌ట్టి.. నీళ్లు మాత్ర‌మే ఇస్తున్న‌ట్లుగా చెప్ప‌టంతో.. ప్ర‌ధాని ఏమీ ఇవ్వ‌ని వేళ‌.. తాను రూ.100 కోట్లు ఇస్తాన‌ని చెబితే బాగుండ‌ద‌న్న ఉద్దేశంతో ఆగిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌ధాని ఏమీ ఇవ్వ‌కుండా తాను రూ.100 కోట్లు ఇస్తే ప్ర‌ధానిని అగౌర‌వ‌ప‌ర్చిన‌ట్లుగా ఉంటుంద‌ని భావించి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు. మ‌రి.. శంకుస్థాప‌న రోజున కుద‌ర్లేదు. త‌ర్వాత అయినా ఎందుకు చేయ‌న‌ట్లు? సీమాంధ్రుల‌పై ఎప్పుడూ ఏదో మాట అనేసే కేసీఆర్‌.. ప్ర‌ధాని స‌మ‌క్షంలో కాకున్నా.. త‌ర్వాత అయినా ఇవ్వొచ్చుగా. తాను క‌ట్టిన ముడుపుల్ని తీరిగ్గా ఇచ్చుకుంటూ వ‌చ్చిన కేసీఆర్‌.. అమ‌రావ‌తికి తాను ఇవ్వాల‌నుకున్న సాయాన్ని ఎందుకు ప్ర‌క‌టించ‌న‌ట్లు..?