Begin typing your search above and press return to search.

ఈటలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 July 2021 12:32 PM GMT
ఈటలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X
ఎట్టకేలకు తన మాజీ సహచరుడు, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. ఈటలకు టీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంత గౌరవం ఇచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

మంత్రిగా ఉంటూనే కేబినెట్ నిర్ణయాలను ఈటల తప్పుపట్టారని కేటీఆర్ విమర్శించారు.ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారన్నారు. ఇలా చేసిన తర్వాత ఈటలపై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుందో చెప్పాలన్నారు.

ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎందుకు మంత్రిగా కొనసాగారు? అని కేటీఆర్ నిలదీశారు. ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా మంత్రిగా ఉంచారని గుర్తు చేశారు. ఈటల టీఆర్ఎస్ లో కొనసాగేలా చివరివరకు ప్రయత్నించానని కేటీఆర్ వెల్లడించారు.

హుజూరాబాద్లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రందేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని అన్నారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలకు మాట్లాడే సబ్జెక్ట్ లేదని కేటీఆర్ విమర్శించారు.