Begin typing your search above and press return to search.

సండ్ర చేరాలంటే ఆయ‌న కూడా రావాల్సిందేన‌ట‌!

By:  Tupaki Desk   |   13 Jan 2019 10:48 AM GMT
సండ్ర చేరాలంటే ఆయ‌న కూడా రావాల్సిందేన‌ట‌!
X
స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య టీఆర్ ఎస్ లో చేర‌బోతున్నార‌ని చాన్నాళ్లుగా వార్త‌లొస్తున్నాయి. సంక్రాంతి పర్వ‌దినానికి ముందే ఆయ‌న కారెక్క‌డం ఖాయ‌మ‌ని అంతా చెప్పుకున్నారు. అయితే - టీఆర్ ఎస్ అగ్ర నాయ‌క‌త్వం సండ్ర‌కు షాకిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న్ను పార్టీలో చేర్చుకునేందుకు గులాబీ ద‌ళం సిద్ధంగానే ఉన్న‌ప్ప‌టికీ.. అందుకు ఓ ష‌ర‌తు విధించిన‌ట్లు స‌మాచారం.

ఓటుకు నోటు కేసులో సండ్ర ఏ-2గా ఉన్నాడు. టీడీపీలోనే కొన‌సాగితే ఈ కేసులో త‌న‌ను టీఆర్ ఎస్ వేటాడ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. అందుకే టీఆర్ ఎస్ అధిష్ఠానంతో చ‌ర్చ‌లు జ‌రిపిన సండ్ర‌.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు మంత్రి ప‌ద‌విని కూడా ఖాయం చేసుకున్నార‌ట‌. ఇక రేపో మాపో పార్టీ మార‌డ‌మే ఖాయ‌మ‌ని భావిస్తూ తాజాగా టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ తో భేటీ అయ్యార‌ట‌. ఈ స‌మావేశంలో కేటీఆర్ చెప్పిన మాట‌ల‌తో సండ్ర‌కు గ‌ట్టి షాక్ త‌గిలిందట‌.

సండ్ర‌ను త‌మ‌ పార్టీలో చేర్చుకునేందుకు పూర్తి సంసిద్ధత వ్య‌క్తం చేసిన కేటీఆర్‌.. అందుకు ఓ ష‌ర‌తు మాత్రం విధించార‌ట‌. ఒంట‌రిగా వ‌స్తే పార్టీలోకి తీసుకోబోమ‌ని - టీడీపీ త‌ర‌ఫున తెలంగాణ‌లో గెలిచిన మ‌రో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర రావు(అశ్వ‌రావుపేట‌)ను కూడా తీసుకురావాల‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. తెలంగాణ‌లో టీడీపీ ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలిపార‌ట‌. అందుకే మెచ్చ‌ను కూడా తీసుకువ‌స్తేనే సండ్ర‌ను పార్టీలో చేర్చుకొని మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని తేల్చిచెప్పార‌ట‌. ఒంట‌రిగా మాత్రం సండ్ర‌ను చేర్చుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

కేటీఆర్ ష‌ర‌తుతో ఖంగుతిన్న సండ్ర‌.. చేసేదేమీ లేక ఇటీవ‌ల ప‌లుమార్లు మెచ్చ నాగేశ్వ‌ర‌రావుతో మంత‌నాలు జ‌రిపార‌ట‌. అయితే - మెచ్చ గులాబీ ద‌ళంతో చేతులు క‌లిపేందుకు ఎంత‌మాత్ర‌మూ సిద్ధంగా లేర‌ట‌. ఎందుకంటే టీఆర్ ఎస్ లో చేర‌డం వ‌ల్ల త‌న‌కు అద‌నంగా ఒన‌గూరే ప్రయోజ‌న‌మేమీ లేదు క‌దా అని యోచిస్తున్నార‌ట‌. సండ్ర‌లాగా నాకు మంత్రి ప‌ద‌వేమీ ద‌క్క‌దు క‌దా.. మ‌రి నేనెందుకు పార్టీ మారాలి అని ప‌లువురు స‌న్నిహితుల వ‌ద్ద త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెడుతున్నాడ‌ట‌. దీంతో మంత్రి ప‌ద‌వి ఇస్తానంటే టీఆర్ ఎస్ లో చేరేందుకు మెచ్చ సిద్ధ‌మేన‌ని ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.