Begin typing your search above and press return to search.
`జాగ్వర్` షూటింగ్ సెట్ లో కేటీఆర్!
By: Tupaki Desk | 4 July 2018 1:32 PM GMTకొద్ది రోజుల క్రితం ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ సహకారంతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కాలేదు. అయితే, అంతకు ఒక రోజు ముందే కర్ణాటక వెళ్లి కొత్త సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. 2 రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత - ప్రముఖ పారిశ్రామిక వేత్త టీ.సుబ్బరామిరెడ్డి మనవడి పెళ్లికి వచ్చిన దేవెగౌడ....కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ రకంగా ఈ జేడీఎస్ - టీఆర్ ఎస్ లు మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, కర్ణాటక సీఎం కుమారస్వామితో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బెంగుళూరులో కుమారస్వామితో కేటీఆర్ బ్రేక్ ఫాస్ట్ చేశారు. అంతేకాకుండా, కుమారస్వామి తనయుడు నిఖిల్ నటిస్తోన్న `సీతారామ కల్యాణ` చిత్ర షూటింగ్ సెట్స్ కు కేటీఆర్ వెళ్లి నిఖిల్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో దేవెగౌడ ను కేసీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్ సంగతి ఎలా ఉన్నా....జేడీఎస్ తో టీఆర్ ఎస్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బెంగుళూరులో కుమార స్వామిని కేటీఆర్ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. తెలంగాణలో అమలవుతోన్న మిషన్ భగీరథ - హరితహారం వంటి పథకాల గురించి కుమార స్వామికి వివరించారు. ఆ తర్వాత నిఖిల్ నటిస్తోన్న `సీతారామ కల్యాణ` చిత్ర షూటింగ్ సెట్స్ కు కేటీఆర్ వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు. నిఖిల్, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కుమార స్వామితో భేటీ విషయాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ``గౌరవనీయులైన కర్ణాటక సీఎం కుమార స్వామి గారితో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. తెలంగాణలో అమలవుతోన్న మిషన్ భగీరథ - హరితహారం వంటి అనేక పథకాల గురించి వివరించాను.`` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పరిణామాలన్నింటి నిశితంగా పరిశీలిస్తే.....థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు కనిపించడంలేదు. అందులోనూ, 2019 ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా కేటీఆర్ ను నామినేట్ చేసి....జాతీయ రాజకీయాలపై కేసీర్ దృష్టి మరల్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.