Begin typing your search above and press return to search.

3 భాషలు.. 2 యాసల్లో మాట్లాడుతున్నాడే

By:  Tupaki Desk   |   26 Jan 2016 6:25 AM GMT
3 భాషలు.. 2 యాసల్లో మాట్లాడుతున్నాడే
X
గ్రేటర్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నతెలంగాణ అధికారపక్షం.. గ్రేటర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇందుకోసం అన్నీ తానై గ్రేటర్ ఎన్నికల్ని నడిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లోపార్టీ అభ్యర్థుల ఎంపిక మొదలు.. టిక్కెట్లు దక్కక ఆగ్రహంగా ఉన్న వారిని బుజ్జగించటం మొదలు గ్రేటర్ ఎన్నికల విషయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూస్తూ ముందుకెళుతున్నారు.

గంటల తరబడి పని చేస్తున్నా.. విపరీతమైన పని ఒత్తిడితో ఉన్నా.. ముఖం మీద చిరునవ్వు చెరగనీయకుండా.. మాటల్లో సూటిదనం మిస్ కాకుండా.. ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే.. ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటం కేటీఆర్ కే చెల్లింది. ఏ వర్గానికి చెందిన ఓటర్ల మనసు నొప్పించకుండా వ్యవహరించటంలో కేటీఆర్ కు ఫుల్ మార్కులు పడతాయి.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎవరికి.. ఎక్కడేం కావాలో ఆ విషయాల్ని మాత్రమే ప్రస్తావించటం.. విమర్శల విషయంలోనూ ఆచితూచి మాట్లాడే విషయంలోనూ కేటీఆర్ ఎక్కడా తప్పు చేయటం లేదు. తండ్రి మాదిరే భాష మీద తనకున్న పట్టును ప్రదర్శిస్తున్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందీలోనూ.. విద్యాధికులు ఉన్న ప్రాంతాల్లో ఇంగ్లిషులోనూ.. బస్తీ ప్రజలున్న ప్రాంతాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతున్న ఆయన.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల దగ్గర ప్రచారానికి వచ్చేసినప్పుడు తెలంగాణ యాస ‘డోస్’ కాస్త తగ్గించి కేటీఆర్ ప్రసంగించటం మరో విశేషంగా చెప్పాలి.

జోకులు.. పిట్టకథలతో పాటు.. ఎవరికి తగ్గ రీతిలో వారితో మాట్లాడుతూ.. తాను వాళ్ల వ్యక్తినే అన్న భావన కలిగించటంలో కేటీఆర్ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ప్రచారంలో మనసు దోచుకుంటున్న ఆయన.. ఓటర్ల మీద ఎంత ప్రభావం చూపారన్నది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ అర్థం కావు.