Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు మంట పుట్టినా ఏం చేయలేకపోయారట

By:  Tupaki Desk   |   3 May 2016 6:01 AM GMT
కేటీఆర్ కు మంట పుట్టినా ఏం చేయలేకపోయారట
X
తెలంగాణ సీనియర్ మంత్రిగారి తాటిముంజల ముచ్చట జనాలకు సినిమా కష్టాలు తీసుకొచ్చింది. సాదాసీదా జనాల కష్టం మాట అటు ఉంచితే.. ఆ మంత్రిగారి కారణంగా ముఖ్యమంత్రి గారి అబ్బాయి కూడా బాధితుడిగా మారారట. అయితే.. సీనియర్ మంత్రిగారి ముచ్చట తెలిసి.. ఏమీ అనలేక మంత్రి కేటీఆర్ కామ్ గా ఉన్నారట. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ మధ్యన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ ఇంట్లో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.

ఆ పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. పార్టీ నేతలే కాదు.. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లికి వెళ్లిన ఒక సీనియర్ మంత్రికి.. దారిన పోతుంటే తాటిముంజలు రోడ్డుపక్కన అమ్మటం కనిపించాయట. తాటిముంజలంటే బాగా ఇష్టపడే సదరు మంత్రిగారు తన భారీ కాన్వాయ్ ను రోడ్డు మీద అలానే ఆపేసి.. కిందకు దిగి తానే స్వయంగా కొనుక్కునే ప్రయత్నం చేశారు. మంత్రిగారి స్థాయి వ్యక్తి రోడ్డు మీద దిగి తాటిముంజలు కొనే పనిలోకి పడితే.. ఆయన వెంట ఉండే సెక్యూరిటీ ఎంత అలెర్ట్ గా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇదిలా ఉంటే.. మంత్రిగారి తాటిముంజల షాపింగ్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జాం అయ్యేలా చేసింది. అయితే..ఈ విషయాన్ని సదరు మంత్రివర్యుల దృష్టికి రాలేదు. నిజానికి ఆయన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే.. ఆయన తాటిముంజల కోసం దిగింది.. నగర శివారులోని కొంపల్లి ప్రాంతంలో కావటంతో పెద్ద ట్రాఫిక్ ఉండని అనుకొని ఉండొచ్చు. మంత్రిగారి తాటిముంజల కొనే వ్యవహారం కాస్త టైం తీసుకోవటంతో రోడ్ల మీద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇదే పెళ్లి కోసం ఈ రూట్లోనే వస్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్ జాంలో చిక్కుకుంది.

ఇంత ట్రాఫిక్ జాం ఏమిటని ఆశ్చర్యపోయిన కేటీఆర్.. ఆరా తీస్తే మంత్రిగారి తాటిముంజల వ్యవహారం తెలిసిందట. చూస్తూ.. చూస్తూ సీనియర్ మంత్రిని ఏమీ అనలేక.. కాస్త అసహనపడుతూనే ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ మౌనంగా ఉండిపోయారట. మంత్రిగారి తాటిముంజల మోజేమో కానీ.. జనాలకు.. తోటి మంత్రులకు సినిమా చూపించిందని చెప్పక తప్పదు.