Begin typing your search above and press return to search.

ఢిల్లీకి నీతులు స‌రే.. మ‌న సంగ‌తేంది కేటీఆర్?

By:  Tupaki Desk   |   16 March 2018 10:40 AM IST
ఢిల్లీకి నీతులు స‌రే.. మ‌న సంగ‌తేంది కేటీఆర్?
X
సోష‌ల్ మీడియాలో య‌మా చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్.. టైం చూసుకొని ట్వీట్ల‌తో పంచ్ లు వేయ‌టం తెలిసిందే. తాజాగా బీజేపీకి ఆయ‌న త‌న‌దైన శైలిలో ట్వీట్ పంచ్ సంధించారు. తాజాగా వెల్ల‌డైన యూపీ.. బీహార్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఆయ‌న ట్వీట్ చేశారు. అధికారం అనేది శాశ్వితం కాద‌ని.. ఆ విష‌యాన్ని స్ప‌ష్ట‌మైన సందేశంగా ఢిల్లీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పంపింద‌న్నారు. యూపీలో బీజేపీకి చెందిన రెండు ఎంపీ స్థానాల్ని స‌మాజ్ వాదీ పార్టీ గెలుపొందిన నేప‌థ్యంలో మోడీ స‌ర్కారుపై ట్వీట్ పంచ్ వేశారు.

రాజ‌కీయాల్లో జాతీయ పార్టీల పాత్ర త‌గ్గిపోయిందని త‌మ అధినేత కేసీఆర్ మాట‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. యూపీలో అధికార బీజేపీకి ఊహించ‌ని రీతిలో ఎదురైన ఓట‌మి నేప‌థ్యంలో తాజా ట్వీట్ వ్యాఖ్య చేశారు. మోడీ స‌ర్కారుకు నీతులు చెప్పేస్తున్న మంత్రి కేటీఆర్‌.. తాను చెప్పిన అధికారం అన్న‌ది శాశ్వితం కాద‌న్న మాట త‌మ‌కూ వ‌ర్తిస్తుంద‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విప‌క్షాల్ని అణిచివేసేలా.. ఏక‌ప‌క్ష వైఖ‌రిని అనుస‌రిస్తూ.. ఉద్య‌మ‌నేత‌ల్ని తొక్కేస్తున్న వైఖ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల్లో అసంతృప్తికి గురి చేస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అధికారం శాశ్వితం అన్న‌ట్లుగా ముఖ్య‌మంత్రి వైఖ‌రి ఉంద‌న్న విమ‌ర్శ అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. అదే విష‌యాన్ని అన్యాప‌దేశంగా కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా బ‌య‌ట‌పెట్ట‌టం గ‌మ‌నార్హం. ఎదుటోళ్ల‌కు పంచ్ లు వేస్తున్న కేటీఆర్.. త‌మ సంగ‌తి కూడా ఆలోచించుకోవాల‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.