Begin typing your search above and press return to search.

ప్లాన్ బీ కాదు ప్లాన్ సీతో వ‌స్తున్నామంటున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   28 Nov 2018 5:30 AM GMT
ప్లాన్ బీ కాదు ప్లాన్ సీతో వ‌స్తున్నామంటున్న కేటీఆర్
X
ప్ర‌ధానమంత్రి న‌రేంద్రమోదీ టార్గెట్‌ గా ఇటీవ‌లి కాలంలో విమ‌ర్శలు గుప్పిస్తున్న మంత్రి కేటీఆర్ తాజాగా - మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ``ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళ్లడం తగ్గించుకొని దేశంలో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయి. హెలికాప్టర్‌ లో తిరుగడం కాదు - నేలపైకి దిగి ప్రజలతో మాట్లాడితే తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుంది`` అని ఎద్దేవా చేశారు.న్యూస్ 18 చానల్ ఆధ్వర్యంలో ఎజెండా తెలంగాణ అంశంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సీఎన్‌ ఎన్ న్యూస్‌ ఎడిటర్ భూపేన్ చౌబే అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చారు. నిజామాబాద్ సభలో ప్రధాని మాట్లాడుతూ.. హెలికాప్టర్ నుంచి చూస్తే అసలు అభివృద్ధి కనిపించలేదనడంపై ఘాటుగా స్పందించారు. మొదట ప్రధాని విదేశీ పర్యటనలు మానుకొని స్వదేశంలో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. హెలికాప్టర్ దిగి ప్రజలను అడిగితే తెలంగాణ అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుందని - గాల్లో తిరిగితే ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ ఏ మేలూ చేయలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి - కాళేశ్వరాన్ని అటకెక్కించారని గుర్తుచేశారు. దేశానికి సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ - బీజేపీ రెండూ విఫలమయ్యాయని విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా త‌మ ద‌గ్గ‌ర ప్లాన్ `సి` ఉంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రంలో ఈ సారి బీజేపీ - కాంగ్రెస్ అధికారంలోకి రావని - టీఆర్‌ ఎస్ బలమైన శక్తిగా ఎదిగి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ - కాంగ్రెస్ కాదంటే బీజేపీ అనే ప్లాన్-ఏ ప్లాన్-బీ నుంచి ప్లాన్-సీ తెరపైకి వస్తుందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా బలపడుతున్నాయో జాతీయ మీడియా ఢిల్లీ దాటి చూడాలని సూచించారు. టీఆర్‌ ఎస్‌ ను ఎదుర్కోవడానికి నాలుగు పార్టీలు ఏకమైనప్పటికీ చిత్తుగా ఓడిపోవడం తథ్యమని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహాఘట్‌ బంధన్‌ గా కాదు ఘటియాబంధన్‌ గా ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. బీజేపికి గతంలో వచ్చిన ఐదు స్థానాలు కూడా రావని - వంద సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు. చంద్రబాబు మహా అవకాశవాది అని పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదమిస్తే - రాజీవ్‌ గాంధీ అదే నినాదంతో ముందుకెళ్లారని - ఈ రోజు కూడా రాహుల్‌ గాంధీ - సోనియాగాంధీ గరీబీ హఠావో అంటున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అంటే దేశాన్ని అభివృద్ధి చేయలేదనే స్పష్టమవుతున్నదన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు నదులను అనుసంధానం చేస్తామన్నప్పటికీ జరుగలేదని - 70 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని తెలిపారు. 45 వేల టీఎంసీలను పొలాలకు మళ్లించగలిగితే రైతుల దు:ఖం తీరిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికీ శౌచాలయ్ (టాయిలెట్లు) నిర్మిస్తామని మోదీ అంటున్నారంటే - 70 ఏండ్లుగా ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట ప్రయత్నాలు జరుగలేదని స్పష్టమవుతున్నదని చెప్పారు.