Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వద్దనుకుంటే ఏం చేయాలో చెప్పిన కేటీఆర్

By:  Tupaki Desk   |   6 April 2021 4:10 AM GMT
లాక్ డౌన్ వద్దనుకుంటే ఏం చేయాలో చెప్పిన కేటీఆర్
X
ఓపక్క తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ జనాలకు ఇదేం పట్టనట్లుగా రోడ్ల మీద ఇష్టారాజ్యంగా తిరగటం.. ముఖానికి మాస్కులు లేకుండా ఉండటం లాంటివి తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. సామాజిక దూరం లాంటివి అస్సలు కనిపించని పరిస్థితి. శానిటైజర్ల వినియోగం తగ్గింది కూడా. కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసే బులిటెన్లలో స్పష్టమవుతున్నా.. వాటిని పట్టించుకునే నాథుడు కనిపించటం లేదు. చాప కింద నీరులా.. విస్తరిస్తున్న కరోనా కేసుల్లో ఇప్పుడో లక్షణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

గతంతో పోలిస్తే.. కరోనా తీవ్రత తక్కువే అయినప్పటికీ.. ఇంట్లో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా సరే.. మిగిలిన వారందరికి ఇట్టే వచ్చేస్తోంది. దీంతో.. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటివేళ.. కేసుల నిరోధానికి ప్రభుత్వ పరంగా ఏమీ చేయట్లేదన్న విమర్శ వినిపిస్తోంది. అయితే.. లాక్ డౌన్ తో పాటు.. పరిమితులు విధించే కొద్దీ ఆర్థికంగా ప్రభుత్వం మీదా.. పౌరుల మీద భారం పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో.. ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి.

ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా జరిగిన నష్టం నుంచి కోలుకోలేని వారు లక్షల్లో ఉన్నారు. అలాంటిది మరోసారి తీవ్రమైన పరిమితులు విధిస్తే.. చాలా నష్టపోయే అవకాశం ఉందని చెప్పక తప్పదు. కేసుల విస్తరణ ఎలా ఉన్నా.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు.. పూర్తి చేస్తున్న పనుల ప్రారంభం జోరుగా సాగుతోంది. తాజాగా కేపీహెచ్ బీ నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్లే వారికి మరింత సదుపాయంగా ఉండేలా తాజాగా రోడ్ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయటం తెలిసిందే. దీంతో.. లక్షలాది మంది వాహనదారులకు సౌకర్యంగా ఉండనుంది. దీని ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

లాక్ డౌన్ వద్దనుకునే వారంతా తప్పనిసరిగా ముఖానికి మాస్కు పెట్టుకోవాలన్న సూచన చేశారు. కరోనా పూర్తిగా పోలేదని.. రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. లాక్ డౌన్ వద్దనుకుంటే ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన ఆయన మాట హైదరాబాద్ మహానగర ప్రజల చెవిన పడే అవకాశం ఉందంటారా?