Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల నినాదం ఏంటో చెప్పిన కేటీఆర్‌ !

By:  Tupaki Desk   |   19 May 2018 4:55 AM GMT
ఎన్నిక‌ల నినాదం ఏంటో చెప్పిన కేటీఆర్‌ !
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు రాష్ట్ర ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాబోయే ఎన్నిక‌ల ఎజెండాను పంచుకున్నారు. సచివాలయంలో తన ఛాంబర్‌ లో మీడియాతో ఇష్టా గోష్ఠిలో సమకాలిన రాజకీయ - పరిపాలన పరమైన అంశాలపై మంత్రి కే తారక రామారావు మాట్లాడారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. రాబోయే టీఆర్ ఎస్‌ పార్టీ పూర్తి మెజార్టీని సాధిస్తుందని, ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంత మెజార్టీ సాధిస్తుందని - టీఆర్ ఎస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందనే ధీమా వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌.. అలా జరక్కపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. `కేసీఆర్‌’ నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్తామని ప్ర‌క‌టించారు. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్‌ అని ప్ర‌క‌టించారు. కేసీఆర్‌ వల్లే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ తెచ్చింది కేసీఆరేన‌ని ప్రజలందరికి తెలుసునని, అందుకే ప్రజలు గ‌త ఎన్నిక‌ల్లో తీర్పు ఇచ్చారని ఆయ‌న విశ్లేషించారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి కేటీఆర్ స్పందిస్తూ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాలను నడిపిస్తారని, మరో పది కాలాలపాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. సీఎంగా కేసీఆర్‌ ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డే చాన్సే లేద‌ని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇందుకు బీజేపీ విధానాలే కార‌ణ‌మ‌ని తెలిపారు. ‘హిందుత్వ’ కార్డుకు ఇక్కడ ఛాన్స్‌ లేదు. కేసీఆర్‌ కంటే గొప్ప ధార్మిక వాది ఏవరు...? బీజేపీ - వీహెచ్‌ పీ - ఆర్ ఎస్ ఎస్‌ ల కంటే గొప్ప ధార్మిక వాది కేసీఆర్‌. కేసీఆర్‌ కంటే యాగాలు - గుళ్లు పెద్ద ఎత్తున కట్టే వారు ఏవరు....? ముస్లిం - హిందూ గొడవలు పెట్టడానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు.`` అని అన్నారు.

టీఆర్ ఎస్ పార్టీ ఏ పార్టీకి అనుబంధం కాద‌ని కేటీఆర్ తెలిపారు. టీఆర్ ఎస్‌ ‘బీ’ టీం - ‘సీ’ టీం అంటూ ఏమీ ఉండదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ``సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌-బీజేపీలకు కొరుకుడు పడకుండా అయ్యారు. రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోడీలకు చిక్కడు దొరకడు లాగా అయ్యారు. అందుకే ఆ పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తుంటారు`` అని వ్యాఖ్యానించారు.``ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకోవాలనుకోవడం సహజం. టీఆర్ఎస్‌ గెలుస్తుందని మేం అనుకుంటున్నాం... బీజేపీ - కాంగ్రెస్‌ గెలుస్తుందని వాళ్లు అనుకుంటున్నారు... అంతిమ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలా. ప్రజల మనసును గెలుచుకోవడం ముఖ్యం.`` అని కేటీఆర్ అన్నారు. రైతు బంధు పథకానికి అద్బుతమైన స్పందన వస్తుందని.... ఎమ్మెల్యేగా తన పది సంవత్సరాల జీవితంలో ప్రజల నుంచి అత్యంత బ్రహ్మండంగా స్పందన వచ్చిన పథకం ఇదేన‌ని అన్నారు. ఈ ప‌థ‌కం రెండో విడ‌త హ‌రిత విప్ల‌వానికి కార‌ణంగా మారుతుంద‌ని జోస్యం చెప్పారు.