Begin typing your search above and press return to search.

12 మందికి 16 మందికి తేడా ఏంది కేటీఆర్?

By:  Tupaki Desk   |   26 Feb 2019 9:30 AM GMT
12 మందికి 16 మందికి తేడా ఏంది కేటీఆర్?
X
మాట‌ల‌తో క‌న్వీన్స్ చేయ‌టంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట‌ల‌తో మ‌న‌సు ఆలోచించ‌కుండా చేయ‌టంలో కేసీఆర్ టాలెంట్ మ‌రెవ‌రికీ లేదు. అంతో ఇంతో ఉందంటే కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడు కేటీఆర్ కే. తండ్రికి త‌గ్గ‌ట్లే మాట‌ల‌తో బురుడీ కొట్టించే తీరును బాగానే వంట ప‌ట్టించుకుంటున్నార‌ని చెప్పాలి.

లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన వేళ‌.. ఇప్పుడు కేసీఆర్‌.. కేటీఆర్ దృష్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 16 త‌మ సొంతం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. మిగిలిన ఒక్క సీటు త‌మ‌కు మిత్రుడైన మ‌జ్లిస్ కు వ‌దిలేశారు. మిత్రుడి సీటు మిన‌హా మిగిలిన సీట్ల‌లో గులాబీ జెండా ఎగ‌ర‌టం ద్వారా తెలంగాణ‌లో క్లీన్ స్వీప్ చేయాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు తండ్రీకొడుకులు ఇద్ద‌రూ.

త‌మ‌కు 16 మంది ఎంపీల్ని ఇస్తే ఢిల్లీని గ‌డ‌గ‌డ‌లాడిస్తామంటూ భ‌విష్య‌త్ మాట‌లు చెబుతున్న కేటీఆర్.. వ‌ర్త‌మానం గురించి అస్స‌లు మాట్లాడ‌టం లేదు. ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌స్తుతం త‌మ‌కున్న ఎంపీల లెక్క‌ను ప్ర‌స్తావించ‌టానికి సైతం ఇష్ట‌ప‌డ‌టం లేదు. ప‌ద‌హారు ఎంపీల్ని త‌మ‌కు ఇవ్వాల‌ని నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ చెబుతున్న తండ్రీ కొడుకులు.. ఇప్ప‌టికే త‌మ‌కు 12 మంది ఎంపీలు ఉన్నారన్న విష‌యాన్ని త‌మ మాట‌ల్లో ఎక్క‌డ రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

ప‌ద‌హారు మంది ఎంపీలు త‌మ‌కు అందిస్తే త‌మ స‌త్తా చాటుతామ‌ని చెప్పే తండ్రీకొడుకులు.. ఇప్పడున్న ప‌న్నెండు మంది ఎంపీల‌తో ఏం సాధించార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చేతిలో డ‌జ‌న్ మంది ఎంపీల్ని పెట్టుకొని గ‌డిచిన ఐదేళ్లుగా కేంద్రాన్ని ఏ మాత్రం ఒత్తిడి చేయ‌లేని వారు.. ఇప్పుడు ప‌ద‌హారు సీట్ల‌తో ఏదో చేస్తామ‌న్న మాట‌ల్ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌ద‌హారు మంది ఎంపీలను త‌మ‌కు ఇస్తే.. కేంద్రాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తామ‌న్న మాటలో ఆర్బాట‌మే కానీ ప‌స లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేటీఆర్ చెప్పిన‌ట్లుగా కేంద్రాన్ని గ‌డ‌గ‌డ‌లాడించాలంటే.. మోడీ బ్యాచ్ కు స‌రైన మెజార్టీ రాకూడ‌దు.. రాహుల్ కూట‌మికి కూడా సీట్లు అంతంత‌మాత్రంగా రావాలి. ఆ ద‌శ‌లో కేసీఆర్ కు ప‌ద‌హారు సీట్లు ఉంటే.. అంతో ఇంతో చ‌క్రం తిప్పే వీలుంది. ఒక‌వేళ 2014 మాదిరే మోడీ మాష్టారు దుమ్ము దులిపితే..ప‌ద‌హారు మంది ఎంపీల‌తోనూ కేసీఆర్ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి.

అంటే.. తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ కు 16 మంది ఎంపీల‌ను క‌ట్ట‌బెట్టినా.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పే కీల‌కం కానుంది. స‌రైన మెజార్టీ లేని వేళ‌లో మాత్ర‌మే 16 మంది ఎంపీలు అక్క‌ర‌కు వ‌స్తారు. అలా కాకుండా గాలి ఏక‌ప‌క్షంగా వీస్తే.. 16 మంది ఎంపీలు చేతిలో ఉన్నా చేసేదేముండ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అందుకే.. గాలి వీచే తీరుకు తగ్గ‌ట్లుగా తెలంగాణ ప్ర‌జ‌లు తీర్పు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఆ విష‌యాన్ని చ‌ర్చ‌కు రాకుండా ఉండేందుకే ఢిల్లీని గ‌డ‌గ‌డ‌లాడిస్తామ‌న్న పెద్ద మాట‌లు కేటీఆర్ నోటి నుంచి వ‌స్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.