Begin typing your search above and press return to search.

బండి సంజయ్ కు భారీ సవాలు విసిరిన కేటీఆర్

By:  Tupaki Desk   |   18 March 2022 4:48 AM GMT
బండి సంజయ్ కు భారీ సవాలు విసిరిన కేటీఆర్
X
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే మాత్రం.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసినట్లుగా అనిపించక మానదు. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం చూస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ధఫా కూడా ముందస్తు బాట పట్టొచ్చన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు.. విపక్ష బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్దం గురించి తెలిసిందే. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గని రీతిలో విరుచుకుపడుతున్నారు.

కరీంనగర్ ఎంపీగా వ్యవహరిస్తున్న బండి సంజయ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పైసా పని చేయలేదన్నారు. మూడేళ్ల కాలంలో సంజయ్ ఏం చేశారు? అని ప్రశ్నించిన ఆయన.. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయితీలు పెట్టటం మినహా బండి సంజయ్ సాధించిందేమిటి? అని ప్రశ్నించారు.

కాళేశ్వరానికి పార్లమెంటులో జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదన్న ఆయన.. నిత్యం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టటం మినహా మరేం చేయలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఘాటు సవాలును విసిరారు.

నిజంగానే బండి సంజయ్ కు దమ్ముంటే.. వచ్చే ఎన్నికల్లో ఆయన మంత్రి గంగుల కమలాకర్ పై పోటీ చేసి.. గెలవగలరా? అని ప్రశ్నించారు.

బండి సంజయ్ ను లక్ష ఓట్ల మెజార్టీని సాధించి మరీ ఓడిస్తారన్నారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.