Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు మరో ప్రమోషన్ రెఢీ

By:  Tupaki Desk   |   9 Feb 2016 4:33 AM GMT
కేటీఆర్ కు మరో ప్రమోషన్ రెఢీ
X
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుత్రోత్సాహం పొంగిపొర్లుతోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తన సత్తా ఏమిటో అందరికి తెలిసేలా చేసిన మంత్రి కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ మనసును ఓ రేంజ్ లో దోచుకున్నారు. బహిరంగంగా తన కుటుంబ సభ్యుల్ని పొగిడే అలవాటు లేని కేసీఆర్.. అందుకు భిన్నంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో కేటీఆర్ పని తీరును ప్రశంసించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆ సభలో పేర్కొన్న విధంగానే.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే కొడుక్కి తాను నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖను అప్పజెప్పటం తెలిసిందే.

తాజాగా కేటీఆర్ కు మరో కీలక శాఖను కట్టబెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ.. పంచాయితీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఆదివారం నుంచి పురపాలక శాఖ బాధ్యతలు ఆయన చేతికి రావటం తెలిసిందే. తాజాగా.. పరిశ్రమల శాఖను కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శాఖను మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్నారు. అయన దగ్గరున్న పరిశ్రమల శాఖను కేటీఆర్ ఇవ్వటం.. అదే సమయంలో ఆయన మనసును నొప్పించకుండా ఉండేందుకు వీలుగా.. కేటీఆర్ నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖను జూపల్లికి కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రానున్న ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తామని.. ఒకవేళ ఇవ్వని పక్షంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే మిషన్ భగీరథను స్టార్ట్ చేయటం తెలిసిందే. ఈ శాఖను తాజాగా జూపల్లికి కేటాయించటం ద్వారా.. ఆ పథకం మీద ఎక్కువ ఫోకస్ చేయటం.. అదే సమయంలో ఐటీ.. పురపాలక.. పరిశ్రమలు మొత్తం ఒకే పోర్టు ఫోలియో చేయటం ద్వారా పాలనపరమైన ఇబ్బందుల్ని అధిగమించే వీలుందన్నమాట వినిపిస్తోంది. ఏమైనా.. కొడుక్కి మరో కీలక బాధ్యత అప్పగించేందుకు కేసీఆర్ రెఢీ అయ్యారన్న మాట వినిపిస్తోంది.