Begin typing your search above and press return to search.

కళ్లు చెదిరేలా ఐటీలో తెలంగాణ అభివృద్ధి: మంత్రి కేటీఆర్

By:  Tupaki Desk   |   4 Oct 2021 9:31 AM GMT
కళ్లు చెదిరేలా ఐటీలో తెలంగాణ అభివృద్ధి: మంత్రి కేటీఆర్
X
సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ,ఐటీ రంగంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను వెల్లడిస్తూ రూపొందించిన ప్రత్యేక వీడియోను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం దేశంలో ఐటీ రంగంలో అత్యంత వేగంగా ముందుకుపోతున్న రాష్ట్రం తెలంగాణనే అని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికి ఐటీ జోరు ఏ మాత్రం తగ్గలేదని తెలిపారు.

ఇకపోతే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ లో తమ బ్రాంచులని ఏర్పాటు చేశారు. అమెరికా తర్వాత గూగుల్ అతి పెద్ద క్యాంపస్ ఉండేది హైదరాబాద్ లోనే కావడం విశేషం. అలాగే అమెజాన్, డెలాయిట్ వంటి ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నాయి.

ఐటీ సెక్టార్‌కి సంబంధించి 2014లో ఎగమతుల విలువ రూ. 57 వేల కోట్ల రూపాయలు ఉండగా 2021కి వచ్చేసరికి 1.45 లక్షల కోట్లకు చేరుకుందని ఐటీ మంత్రి తెలిపారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల మంది ఉండగా ప్రస్తుతం 6.28 లక్షల మంది ఐటీ సెక్టార్‌లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా 20 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని ఈ వీడియోలో తెలిపారు. ఇంకా ఈ రంగానికి సంబంధించిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టి ఎస్- ఐ పాస్ మరియు ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటి పరిశ్రమ తో కలసి ప్రభుత్వం పని చేయడం వలన అనేక పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన అమెరికా ఆవల అతిపెద్ద క్యాంపస్ లు 4 హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తో పాటు ఐటీ ఎగుమతుల ను సైతం భారీగా పెంచగలిగమన్నారు.