Begin typing your search above and press return to search.

ఆ ట్వీట్... కేటీఆర్‌ను ఆట ప‌ట్టించేసింది!

By:  Tupaki Desk   |   5 Aug 2017 11:34 AM GMT
ఆ ట్వీట్... కేటీఆర్‌ను ఆట ప‌ట్టించేసింది!
X
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు భ‌విష్య‌త్ అధినేత‌గా ఎదుగుతున్న ఆ పార్టీ నేత‌, తెలంగాణ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు వ్య‌వ‌హార స‌ర‌ళి ఇత‌రుల‌కు కాస్తంత భిన్నంగానే ఉంటుంది. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై ఎదురు దాడి చేయ‌డంలో అయినా, విప‌క్షాల‌పై తానే దాడికి దిగాల‌నుకున్నా, సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండాల‌నుకున్నా కూడా కేటీఆర్‌ను మించిన వారెవ్వ‌రూ లేర‌నే చెప్పాలి. సోష‌ల్ మీడియాలో త‌న‌కు అందిన స‌మ‌స్య‌ల‌పై వేగంగా స్పందించే కేటీఆర్‌... తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌నే కాకుండా నెటిజ‌న్ల మ‌న్న‌న‌ల‌ను కూడా అందుకున్న వైనం మ‌న‌కు తెలిసిందే.

అయినా అస‌లు విష‌యం లేకుండా ఈ ఉపోద్ఘాత‌మెందుకూ అంటారా? అయితే అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్‌... అక్క‌డి నున్న‌టి రోడ్లు, పార్కులు, స‌వ్యంగా ప‌నిచేసే కూడ‌ళ్లు త‌దిత‌రాల‌ను చూసి ఆయ‌న మైమ‌ర‌చిపోయార‌ట‌. ఒక ర‌కంగా చెప్పాలంటే ఢిల్లీలోని ప‌రిస్థితుల‌ను చూసి ఆయ‌న ఫిదా అయ్యార‌ట‌. ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను క‌ల‌లు గ‌న్న హైద‌రాబాదులో ఢిల్లీ లాంటి ప‌రిస్థితులు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా ఆయ‌న ఈ ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా... ఈ ట్వీట్ ద్వారా తాను ఇబ్బంది ప‌డ‌తాన‌ని, త‌న‌ను జ‌నం ఆట ప‌ట్టిస్తార‌ని కూడా త‌న‌కు ముందే తెలుసున‌ని చాలా విచిత్రంగా స్పందించిన కేటీఆర్‌... త‌న‌ను ఆట ప‌ట్టించినా స‌రే... ఈ ఫొటోల‌ను, భావి హైద‌రాబాదు ఎలా ఉండాల‌న్న త‌న భావ‌న‌ను ప్ర‌జ‌లతో పంచుకోకుండా ఉండలేనంటూ ఆయ‌న ఆ ట్వీట్‌ను పోస్ట్ చేసేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో తాను బ‌స చేసిన గ‌ది కిటికీ నుంచి బ‌య‌ట క‌నిపిస్తున్న రోడ్లు, జంక్ష‌న్లు, పార్కుల‌ను త‌న సెల్ ఫోన్ క్లిక్ మ‌నిపించిన కేటీఆర్ వాటిని త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. స‌ద‌రు ఫొటోల‌కు కేటీఆర్ పెట్టిన కామెంట్ ఎలా ఉందంటే... *ఢిల్లీలో నా గ‌ది నుంచి క‌నిపిస్తున్న దృశ్యమిది. చ‌క్క‌ని నున్నని రోడ్లు, ప‌నిచేసే జంక్ష‌న్లు, పార్కులు.. ఇవే నేను హైద‌రాబాద్‌లో చూడాల‌నుకుంటున్నా. ఈ ట్వీట్ గురించి న‌న్ను ఆట‌ప‌ట్టిస్తార‌ని నాకు తెలుసు!* అని కామెంట్ చేశారు.

కేటీఆర్ ఊహించిన‌ట్లుగానే ఆయ‌న ట్వీట్‌కు నెటిజ‌న్లు రీ ట్వీట్ల‌తో ఆయ‌న‌ను ఆట ప‌ట్టించేశారు. ఢిల్లీలోని శుభ్ర‌మైన రోడ్లు, అంద‌మైన పార్కుల‌ను కేటీఆర్ పోస్ట్ చేస్తే... ఆయ‌న‌కు వ‌చ్చిన రీట్వీట్ల‌లో మాత్రం హైద‌రాబాదులోని మురికి కూపాలు, అడ్డ‌దిడ్డంగా సాగుతున్న ట్రాఫిక్‌, కూడ‌ళ్ల‌లో ప‌నిచేయ‌ని సిగ్న‌ల్స్, గుంత‌ల మ‌యంగా మారిన రోడ్ల ఫొటోలు వెల్లువెత్తాయి.