Begin typing your search above and press return to search.

కేటీఆర్‌....సీఎం కుర్చీకి మ‌రింత చేరువ‌గా!

By:  Tupaki Desk   |   23 July 2017 7:55 AM GMT
కేటీఆర్‌....సీఎం కుర్చీకి మ‌రింత చేరువ‌గా!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ భ‌విష్య‌త్ నేత‌గా ప్ర‌చారం పొందుతున్న కేటీఆర్‌పై ఇప్పుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. గులాబీ ద‌ళ‌ప‌తిగా భవిష్య‌త్‌లో కేటీఆర్ ఉంటార‌నే విష‌యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇప్ప‌టికే దాదాపుగా క్లారిటీకి వ‌చ్చాయి. అయితే సీఎం క్యాంప్ ఆఫీసు వేదిక‌గా కేటీఆర్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న తీరు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాశంగా మారింద‌ని అంటున్నారు. పాత క్యాంప్ ఆఫీసు కేంద్రంగా కేటీఆర్ త‌న స్థానాన్ని పరోక్షంగా చాటిచెప్తున్నారా అని ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ వినిపిస్తోంది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఉన్న‌ వాస్తు ప్రాధాన్యం రీత్యా ఉప‌యోగంలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీసును ప‌క్క‌న‌పెట్టి ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరుతో కొత్త కార్యాల‌యాన్ని నిర్మించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్యాంప్ ఆఫీసు నిర్మాణం అనంత‌రం త‌న నివాసం స‌హా అధికారిక‌ కార్య‌కలాపాల‌న్నింటినీ కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌- జ‌న‌హిత వేదిక‌గానే సాగిస్తున్నారు. అయితే సీఎం పాత క్యాంప్ ఆఫీసును ఇప్పుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకుంటున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్ల‌డం వీలైనంత‌గా త‌గ్గించేసిన మంత్రి కేటీఆర్ త‌న ప‌రిధిలో ఉన్న శాఖ‌ల‌కు సంబంధించిన స‌మీక్ష‌ల‌న్నింటినీ పాత క్యాంప్ ఆఫీసులో స‌మీక్షిస్తున్నార‌ని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ ఉప‌యోగించిన చాంబ‌ర్‌ను కేటీఆర్ ఉప‌యోగించేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న కొంద‌రు జ‌ర్న‌లిస్టులు ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ సైతం చేస్తున్నారు. కేటీఆర్ మొద‌ట ఈ చాంబర్‌లో సీఎం కేసీఆర్ గ‌తంలో కూర్చున్న చోట కాకుండా కాస్త దూరంగా కుర్చీ వేసుకొని స‌మావేశాలు సాగించేవారు. అయితే ఇటీవ‌లే ఈ ట్రెండ్ మార్చేశార‌ని అంటున్నారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి ఆస‌నం ఉన్న చోట‌నే త‌న కుర్చీని వేసుకొని స‌మావేశాలు లాగించేస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు. ఈ మార్పు వెనుక మ‌ర్మం ఏమిట‌ని గుస‌గుస‌లాడుతున్నారు. ముఖ్య‌మంత్రి గ‌తంలో ఉప‌యోగించిన చాంబ‌ర్ ఖాళీగా ఉండ‌టం ఎందుకని కేటీఆర్ ఉప‌యోగించ‌డంలో త‌ప్పేముందని కేటీఆర్ స‌న్నిహితులు ప్ర‌శ్నిస్తున్నారు.