Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. కేటీఆర్ దూకుడు ఇంతలా పెంచేయటమా?

By:  Tupaki Desk   |   17 April 2020 3:30 AM GMT
కరోనా వేళ.. కేటీఆర్ దూకుడు ఇంతలా పెంచేయటమా?
X
లాక్ డౌన్ షురూ అయి దగ్గర దగ్గర నాలుగు వారాలు పూర్తి కావొస్తోంది. మే మూడు వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం ఒకవైపు.. అప్పటికైనా ఎత్తి వేస్తారా? కొనసాగిస్తారా? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి బ్యాక్ ఎండ్ లో ఉండి.. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మంత్రి కేటీఆర్.

లాక్ డౌన్ వేళ.. విరాళాలు పలువురు ప్రముఖుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్న ఫోటోలు.. ఆ మధ్యన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ తో పాటు ప్రెస్ మీట్ లో కూర్చున్నట్లుగా ఫోటోలు మీడియాలో వచ్చాయి. ఇదిలా ఉంటే.. గడిచిన కొద్ది రోజులుగా మంత్రి కేటీఆర్ తన తీరును పూర్తిగా మార్చేశారు. ఇప్పటి వరకూ బ్యాక్ ఎండ్ లో కీలకభూమిక పోషించిన ఆయన.. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కు వచ్చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్న హైదరాబాద్ మహానగరంలో ఆయన పర్యటిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. అది కూడా.. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్ మెంట్ జోన్లలో పర్యటించటం.. అక్కడి ప్రజల్ని కలిసి వారి కష్టాల గురించి ఆరా తీయటం షురూ చేశారు. అంతేనా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు.

హైదరాబాద్ మహానగరంలోని కంటైన్ మెంట్ జోన్లు అత్యంత ప్రమాదకరమే కాదు.. కరోనాకు హైరిస్క్ ఉన్న ప్రాంతాలు. అలాంటి చోట్లకు దూసుకెళుతున్న మంత్రి కేటీఆర్.. అక్కడి వారికి భరోసా ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఒక విధంగా ప్రాణాల్ని పణంగా పెట్టినట్లుగా వ్యవహరిస్తున్న కేటీఆర్ దూకుడు వెనుక అసలు మర్మం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ షురూ చేసిన ఇంతకాలానికి ఆయన బయటకు ఎందుకు వస్తున్నారు? ఎందుకింత ఎక్కువగా తిరుగుతున్నారు? అన్నది ప్రశ్నగా మారింది.

ప్రజలు కష్ట కాలంలో ఉన్న వేళ.. ప్రతిఒక్క ప్రజాప్రతినిధి కథానాయకుడు కావాలని.. ప్రజలకు మరింత దగ్గర కావాలని ఆ మధ్యన సీఎం కేసీఆర్ స్వయంగా పిలుపును ఇవ్వటం తెలిసిందే. అయినప్పటికీ.. ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నది తక్కువే. ఇలాంటివేళ..కరోనా హైరిస్క్ ఉన్న ప్రాంతాల్లో పర్యటించటం ద్వారా తనకున్న తెగువను చాటి చెప్పారు. అధికార పార్టీ నేతలకు కొత్త స్ఫూర్తిని ఇచ్చేలా ఆయన తీరు ఉందని చెప్పక తప్పదు.

తెలంగాణకు ఫ్యూచర్ సీఎంగా అంచనాలున్న ఆయన.. కరోనా లాంటి అరుదైన వేళ.. ప్రజలకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే ఆయన తాజా పర్యటనలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. కారణం ఏమైనా కానీ.. కష్టకాలంతో ప్రజల వద్దకు.. అందునా ప్రమాదంలో ఉన్న వారికి భరోసా కల్పించే ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే.