Begin typing your search above and press return to search.

క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కోసం కేటీఆర్ భారీ వ‌రం!

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:16 AM GMT
క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కోసం కేటీఆర్ భారీ వ‌రం!
X
ప్ర‌భుత్వ భూముల్లో నిర్మాణాలు జ‌రిపిన వారికి ఊర‌ట క‌లిగించేలా మంత్రి కేటీఆర్ భారీ వ‌రాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌తో పాటు.. వివాదాస్ప‌ద భూముల్లో నిర్మాణం జ‌రిపిన పేద‌.. ఓ మోస్త‌రు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింద‌న్న భావ‌న క‌లిగేలా కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

గ‌తంలో జారీ చేసిన జీవో నెంబ‌రు 58.. 59 కింద ప్ర‌భుత్వ భూముల్లో నిర్మాణాలు ఉండి.. క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకోవ‌టానికి వీలుగా మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లుగా కేటీఆర్ వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ స్థ‌లాల్లో వెలిసిన కాల‌నీలు.. బ‌స్తీల భూ వివాదాల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. అవ‌స‌ర‌మైతే చ‌ట్టాన్ని స‌వ‌రిస్తామ‌ని చెప్పారు.

ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల‌పై తాజాగా వివిధ మంత్రులు.. ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించిన కేటీఆర్ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. అయితే.. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని ఆయ‌న చెప్ప‌కున్నా.. వంద గ‌జాల లోపు స్థ‌లాల్లో ఆక్ర‌మ క‌ట్ట‌డాలు నిర్మించిన వారికి ఉప‌శ‌మ‌నంగా కేటీఆర్ తాజా నిర్ణ‌యం ఉంటుంద‌ని చెబుతున్నారు.

కాల‌నీలు.. బ‌స్తీల్లోని అసైన్డ్‌.. వ‌క్ఫ్‌.. దేవాదాయ భూములు.. ఎఫ్ టీఎల్ ప‌రిధిలో ఉన్న వాటికి సంబంధించిన అంశాల్ని 15 రోజుల్లో ప‌రిష్క‌రించాల‌ని అధికారుల్ని ఆదేశించారు. ఆర్డీవో స్థాయిలో రికార్డులు స‌వ‌రించ‌క‌పోవ‌టంతోనే స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని.. వాటిని స‌మ‌గ్రంగా ప‌రిశీలించి మార్పులు చేయాల‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే శీతాకాల అసెంబ్లీ స‌మావేశంలో బిల్లును ప్ర‌వేశ పెట్టి చ‌ట్టంగా మార్చే అంశాన్ని ప‌రిశీలిస్తాన‌ని చెప్ప‌టం ద్వారా హైద‌రాబాద్ లోనిపేద.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి మేలు క‌లిగించే నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.