Begin typing your search above and press return to search.

చికాకు పెట్టే వరద నీళ్ల్లలో కేటీఆర్ నడక ఎందుకంత హాట్ టాపిక్?

By:  Tupaki Desk   |   19 Aug 2020 4:10 PM GMT
చికాకు పెట్టే వరద నీళ్ల్లలో కేటీఆర్ నడక ఎందుకంత హాట్ టాపిక్?
X
నాయకులు తయారు కారు. వారంతట వారే పుట్టుకొస్తారు. ఈ మాటకు నిలువెత్తు రూపంలా కనిపిస్తారు మంత్రి కేటీఆర్. మాస్ ప్రజల అభిమానం పెద్దగా ఉండని ఆయన.. తన శక్తికి మించి కష్టపడుతుంటారు. కేసీఆర్ రాజకీయ వారసుడిగా తన మీద ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు అవిశ్రాంతంగా ఆయన పని చేస్తుంటారు. రిస్కులకు వెనుకాడకపోవటం కనిపిస్తాయి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ఆశయం ఉన్నప్పుడు ఆ మాత్రం కష్టపడాల్సిందేగా.

ఆ మాటకు వస్తే అత్యున్నత పదవుల్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఎంతమందికి ఉండదు. కానీ.. మిగిలిన వారికి భిన్నంగా కేటీఆర్ తీరు ఉంటుంది. తాను చాలా కష్టపడుతున్నానని.. విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తున్న విషయాన్ని తన చేతలతో చెప్పుకునేలా వ్యవహరిస్తుంటారు. ఈ విషయంలో తండ్రి కేసీఆర్ కు.. కేటీఆర్ కు సంబంధించి ఒక పెద్ద తేడా ఉంది. ఫలానా వాళ్లు ఏమనుకుంటారన్న విషయాన్ని పట్టించుకోని తీరు కేసీఆర్ లో ఉంటే.. తాను చేసే ప్రతి పని ప్రజల్లో రిజిస్టర్ కావాలన్న తపన కనిపిస్తుంది.

కేటీఆర్ పట్టాభిషేకానికి సంబంధించి వార్తలు తరచూ మీడియాలో రావటం.. కాస్త చర్చ జరిగాక మళ్లీ ఆ విషయం వెనక్కి వెళ్లటం చూస్తున్నదే. గతానికి భిన్నంగా ఈ మధ్యన వార్తలు రావటం లేదు కానీ.. కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు అవసరమైన అన్ని పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో కావొచ్చు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అయినా.. ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లటం చూస్తుంటాం.

అందుకు భిన్నంగా.. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ తాజాగా వరంగల్ నగరంలో పర్యటించటం తెలిసిందే. పర్యటన మొత్తం కూడా అనధికారిక సీఎం హోదాలో జరిగినట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి వాటిని పక్కన పెడితే.. వరంగల్ పర్యటన సందర్భంగా కేటీఆర్ తీరు ఎలా ఉందన్నది ఆసక్తికరంగా మారింది. ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లటం.. పీపీఈ కిట్లు వేసుకొని రోగుల్ని పరామర్శించటానికి ముందు.. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఈ సందర్భంగా వరద నీటిలో ఆయన నడిచిన తీరు చాలామందిని ఆకర్షించింది. సాధారణంగా వరద నీటిలో నడిచే ముందు.. ఫ్యాంటు ఫైకి లాక్కోవటం.. పైన పట్టుకోవటం లాంటివి చేస్తుంటారు. తన చుట్టూ ఉన్న వారంతా అలా ఇబ్బంది పడుతూ నడిచారు. మంత్రి కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రెండు ఫ్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకొని.. వరద నీటిలో ముందుకు వెళ్లారు. తడిచే ఫ్యాంటును ఆయన పట్టించుకోలేదు. పరిణితి చెందిన నేతకు ఉండే లక్షణంలో ఆయనకు కనిపించింది. భౌతిక పరమైన ఇబ్బందుల్ని తాను లెక్క చేయనన్నట్లుగా ఆయన నడక సాగింది. ఆయన చుట్టూ పలువురు మంత్రులు ఉన్నా.. వారందరిలో భిన్నమన్న విషయం తాను భిన్నమన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు. సమస్య మీదనే తన ఫోకస్ తప్పించి.. మిగిలిన అంశాలేవీ తనకు పట్టదన్నట్లుగా వ్యవహరించిన తీరు సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు.