Begin typing your search above and press return to search.

కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని కేటీఆర్ వార్నింగ్

By:  Tupaki Desk   |   10 Dec 2022 8:30 AM GMT
కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని కేటీఆర్ వార్నింగ్
X
ఎప్పుడూ లేని రీతిలో రియాక్టు అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే అయినప్పటికీ.. డిఫ్యాక్టో సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తుంటారని రాజకీయ వర్గాలే కాదు.. అత్యున్నత అధికారిక వర్గాలు సైతం చెవులు కొరుక్కోవటం.. అందుకు తగ్గట్లే ఆయనకు సకల మర్యాదలు ఇవ్వటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులు ఎందరు ఉన్నప్పటికీ.. మంత్రి కేటీఆర్ వారికి కాస్త భిన్నమైన స్థాయి అన్నది తెలిసిందే. ఇక్కడ మంత్రి కేటీఆర్ గురించి ఒక విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. తానెంత పవర్ ఫుల్ అయినప్పటికీ తన పరిధిని కాస్తంత కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తన హవా నడిపించే టాలెంట్ కేటీఆర్ సొంతమని చెప్పాలి.

ముఖ్యమంత్రి తన తండ్రే అయినప్పటికీ.. ఒక కొడుకు మాదిరి కాకుండా.. ఒక మంత్రిగానే వ్యవహరిస్తూ మిగిలిన వారు వేలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. అలాంటి మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్య రోటీన్ కు కాస్త భిన్నమని చెప్పాలి.

కేసీఆర్ సర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన ఎపిసోడ్ గా బాసర ట్రిపుల్ ఐటీని చెప్పాలి. నిజానికి వేలాది మంది విద్యార్థులు న్యాయమైన తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసినా.. స్పందించాల్సిన సమయంలో స్పందించని పరిస్థితి. ఆ డ్యామేజ్ ను కాస్త కంట్రోల్ చేసుకునేందుకు మంత్రి సబిత ఎంట్రీ ఇవ్వటం.. ఆ తర్వాత ఆమెకు సాధ్యం కాకపోవటంతో మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో భేటీ కావటం.. వారి ఆందోళనలో న్యాయం ఉందంటూ కాస్తంత ఊరడింపు మాటలతో తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. పలు హామీలు ఇచ్చి విద్యార్థుల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే.. కొంత కాలానికే మరోసారి ఫుడ్ పాయిజన్ కావటం.. విద్యార్థులు ఆందోళన చెందటం.. బాసర ట్రిపుల్ఐటీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్ రోటీన్ కు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును బయటకు తీసుకురావటం గమనార్హం.

బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని.. నాణ్యమైన ఫుడ్ పెట్టే విషయంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారని.. తరచూ ఫుడ్ పాయిజన్ అవుతున్నా మెస్ కాంట్రాక్టర్ ను మార్చకపోవటం ఏమిటంటూ వీసీపై సీరియస్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు లేవన్న మాటతో పాటు.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోవాలంటూ ట్రిపుల్ ఐటీ అధికారులకు చెప్పటం గమనార్హం.

వరుస పుడ్ పాయిజన్ ఇష్యూపై సీరియస్ గా ఉన్న విద్యార్థుల్ని బుజ్జగించటానికి అన్నట్లుగా వారికి ల్యాప్ టాప్ లు.. బూట్లు.. డెస్కు టాప్ లు పంపిణీ చేశారు. విద్యార్థులకు వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే.. వర్సిటీ అధికారులపై సీరియస్ కావటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఇప్పటికైనా బాసర ఐఐటీ అధికారుల తీరు మారుతుందా? లేదా? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.