Begin typing your search above and press return to search.

సీఎం మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకోమంటూ కేటీఆర్ వార్నింగ్

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:01 AM GMT
సీఎం మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకోమంటూ కేటీఆర్ వార్నింగ్
X
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కమ్ మంత్రి కేటీఆర్ తమ వ్యతిరేకులకు భారీ వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకున్నామని.. ఏడేళ్లు భరించామని.. ఇక భరించే ప్రసక్తే లేదని.. ఇకపై ఏదైనా మాట అంటే బరాబర్ సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఏడేళ్లు ఎంతో ఓపిక పట్టామని.. మౌనంగా ఉండే కొద్దీ మాటలు ఎక్కువ అవుతున్నాయని ఇకపై ఊరుకునేది లేదన్నారు. కొన్ని పార్టీలు పేరుకు ఢిల్లీ పార్టీలని.. చేసేవి చిల్లర పనులన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అని.. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు తమ పార్టీని అడ్డుకోవటం ఎవరితరం కూడా కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లలో చేయలేని పనిని ఏడేళ్లలో చేసి చూపిన ఘనత తమ పార్టీదని ఆయన చెప్పారు. ఈ మాటలన్నింటికి వేదికగా.. హైదరాబాద్ మహానగర టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్.. తెలంగాణ బీజేపీ నేతల్ని ఎవరూ పట్టించుకోలేదని.. తెలంగాణ వచ్చిన తర్వాతే కేసీఆర్ పుణ్యమా అని కొందరికి పదవులు దక్కాయని.. వీటిని చూసుకొని కొందరు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధకుడని.. వయసులో 20 ఏళ్లు పెద్దవారు అని.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై చిల్లర మాటలు మాట్లాడటం తగునా? అని ప్రశ్నించారు.

ప్రజలకు అన్ని పార్టీల నాయకుల చరిత్రా తెలుసని.. కేసీఆర్ పాలనకు ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. కొందరు విపక్ష నేతలు తట్టుకోలేక.. కేసీఆర్ పై పిచ్చి ప్రేలాపనులు చేస్తున్నారని.. వారిని ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు. ఒకవేళ.. అదే నిజమైతే.. మంత్రి కేటీఆర్ సైతం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏడేళ్లు భరించామని చెబుతున్న కేటీఆర్.. ప్రజల్లో ఐడెంటిటీ లేని వారు ఏం మాట్లాడితేనేం.. వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమిటో? అన్న సందేహం కలుగక మానదు.

నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. పార్టీకి హైదరాబాద్ కంచుకోటగా అభివర్ణించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలు తమకు పదవులు రాలేదని బాధ పడొద్దన్నారు. త్వరలోనే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోని 500 నామినేటెడ్ పోస్టుల్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. దసరా.. దీపావళి తర్వాత కొత్త కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.