Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కేటీఆర్‌...ముఖ్య‌మంత్రిని చేయాల‌నే స‌మ‌యంలోనే!

By:  Tupaki Desk   |   24 Aug 2020 3:35 PM GMT
ఢిల్లీలో కేటీఆర్‌...ముఖ్య‌మంత్రిని చేయాల‌నే స‌మ‌యంలోనే!
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌ను సీఎంగా చేయాలనే డిమాండ్ ప్ర‌ధాన‌మైంది. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుఅన్న‌ట్లుగా ఎమ్మెల్యేలు, ముఖ్య‌నేత‌లు ఈ డిమాండ్ చేస్తున్నారు. బోదన్ ఎమ్మెల్యే షకీల్ ఈ మేర‌కు డిమాండ్ చేయ‌గా అనంత‌రం ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి స‌మ‌యంలోనే కేటీఆర్ ఢిల్లీలో ప‌ర్య‌టించ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఓ వైపు రాష్ట్రంలోని అంశాల‌పై వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా నేడు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. కేంద్ర‌ పౌరవిమానయాన శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి ప‌లు కీల‌క అంశాలు చ‌ర్చించారు. ఇటు విమాన‌యానం, అటు ప‌ట్ట‌ణాభివృద్ధిపై కేటీఆర్ చ‌ర్చించారు.

కేంద్ర మంత్రితో భేటి అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పట్టణాభివృద్ధి శాఖ,విమానయాన శాఖకు సంబంధించిన అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. స్వచ్ఛ భారత్ నిధులు,అమృత్ పథకం నిధులు,15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 784 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామ‌న్నారు. వాటితో పాటుగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ నిర్మాణం కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. వరంగల్ మమునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని కోరగా.. అందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ త్వరలో కేంద్ర బృందం పంపుతామని తెలిపారన్నారు. త్వరలో వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీంతో పాటుగా ఆదిలాబాద్‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లోని ప్రాజెక్టుల‌పై కూడా చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్ర మంత్రి హర్దీప్ పూరికి వివరించాన‌ని, దానిపై ఆయ‌న‌ సానుకూలగా స్పందించారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఆక్టోబర్‌లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని కేంద్ర మంత్రి సూచించార‌ని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన 2537.81 లక్షలను మంజూరు చేయాలని కోరామ‌న్నారు. కాగా, ఓ వైపు రాష్ట్రంలో యువ‌నేత‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌నే డిమాండ్ తెర‌మీద‌కు వ‌స్తుండ‌గా మ‌రోవైపు కేటీఆర్ ఢిల్లీ టూర్ చ‌ర్చ‌కు కార‌ణంగా నిలుస్తోంది.