Begin typing your search above and press return to search.

పెద్ద సారు పక్కన మరో విధేయుడు!

By:  Tupaki Desk   |   9 July 2022 11:30 PM GMT
పెద్ద సారు పక్కన మరో విధేయుడు!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన వ్యతిరేక వార్తలు రాసే మీడియానే చాలా తక్కువ. అలాంటిది ఆయన ఇంట్లో ఏదో జరుగుతుందన్న విషయాల్ని రాసే పరిస్థితి లేదు. అయినప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ.. కొన్ని యూ ట్యూబ్ చానళ్లలోనూ కేసీఆర్ ఇంట్లో అధిపత్య పోరు తీవ్రంగా సాగుతున్నట్లుగా వార్తలు వస్తుంటాయి. కానీ.. అవేమీ ప్రధాన మీడియాలో ఎప్పుడూ కనిపించిన పరిస్థితి లేదు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? లేదా? అన్న దానిపై స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.

అయితే.. ఇంట్లో అధికార లొల్లి సంగతి పక్కన పెడితే.. గులాబీ బాస్ కమ్ పెద్ద సారుకు సంబంధించిన అన్ని విషయాల్ని కొన్ని సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫాం హౌస్ అంటూ రాజకీయ ప్రత్యర్థులు పిలిచే కేసీఆర్ ఫార్మర్ హౌస్ లో ఉంటూ ఆయనకు చేదోడు వాదోడుగా వ్యవహరిస్తూ.. ఆయనకు సంబంధించిన అన్ని సంగతుల్ని చూసే విషయంలో సంతోష్ కు పోటీ వచ్చే వారే ఉండరని చెబుతారు.

అలాంటి సంతోష్ కు ఇప్పుడు చెక్ పడిందా? అన్నదిప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇదంతా ఎందుకంటే.. కేసీఆర్ కు ఉన్న అలవాట్లేనని చెబుతారు. ఆయన తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిని తరచూ మారుస్తూ ఉంటారని చెబుతారు. ఉద్యమ కాలం నుంచి ఇటీవల కాలం వరకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిని చూస్తే.. చాలామంది నేతలు మారిపోవటం.. వారి ప్రాధామ్యతల్లోనూ తేడాలు ఉండటం చూస్తున్నదే.

ఇదిలా ఉంటే.. రాజ్యసభ సభ్యుడు కమ్ దగ్గర బంధువైన సంతోష్ ను కేసీఆర్ కు దూరంగా ఉంచే ప్రక్రియ మొదలైందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో చిన్న బాస్ గా పిలుచుకునే మంత్రి కేటీఆర్ హస్తం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇంతకాలం తన తండ్రికి సంబంధించిన విషయాల్ని చూసుకోవటంతో పాటు.. ఆయనకు సన్నిహితంగా ఉంటూ వ్యవహారాల్ని నడిపించే సంతోష్ ను కాస్తంత దూరం చేసి.. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎమ్మెల్సీని గులాబీ బాస్ ఉంచినట్లుగా చెబుతున్నారు.

ఈ ప్రక్రియ దాదాపు ఏడాదిన్నర క్రితమే మొదలైనా.. ఇటీవల కాలంలో ముఖ్యులు గుర్తించే స్థాయి వరకు విషయం వెళ్లిందని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత పోరు సాగుతుందన్న దానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. కేసీఆర్ దగ్గరగా ఉండే సంతోష్ విషయంలో మాత్రం తేడా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. అధికారక్షేత్రంగా మారుతున్న ఎంపీ సంతోష్ కు చెక్ పెట్టేందుకు వీలుగా కేటీఆర్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతన్నది కాలమే సరైన సమాధానం ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.