Begin typing your search above and press return to search.

ఈ విషయంలో కేటీఆర్ ను మెచ్చుకోవాల్సిందే బాస్

By:  Tupaki Desk   |   11 Jan 2022 5:41 AM GMT
ఈ విషయంలో కేటీఆర్ ను మెచ్చుకోవాల్సిందే బాస్
X
వరాలు ఇచ్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన మనసుకు నచ్చాలే కానీ.. ఖర్చు ఎంతన్న విషయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ నిధుల్ని.. తన ఇష్టాలకు అనుగుణంగా ఖర్చు చేస్తుంటారు. ఎక్కడిదాకానో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర సిద్ధిస్తే.. కొన్ని దేవాలయాల్లో కేసీఆర్ మొక్కటం.. వాటిని తీర్చటం కోసం ప్రజా సొమ్మును ఖర్చు చేయటం ఆయనకే చెల్లు. ఎవరైనా తమ వ్యక్తిగత మొక్కుల్ని రాష్ట్ర ఖజానా మీద రుద్దటం చేయరు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మాత్రం వ్యవహరిస్తారు.

ఇలాంటి తీరే మంత్రి కేటీఆర్ కూడా పాటిస్తారన్న ఆరోపణ ఉంది. తాజా ఎపిసోడ్ లో మాత్రం కేటీఆర్ ను అభినందించాల్సిందే. దీనికి కారణం.. ఆయన తన ఇష్టానికి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ నిధులను వినియోగించకుండా.. తన వ్యక్తిగత సొమ్మును వినియోగించటం అభినందించాల్సిన అంశంగా చెప్పాలి.

పుట్టు మూగ అయిన పంజాబ్ చదరంగ క్రీడాకారిణి మాలిక హండాకు మంత్రి కేటీఆర్ తన వ్యక్తిగత నిధులతో రూ.15 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అనేక జాతీయ పోటీల్లో విజయం సాధించినా.. వైకల్యం కారణంగా పంజాబ్ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి సాయాన్ని అందించలేదు. తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆమె తాజాగా ట్వీట్ లో పేర్కొంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆమెను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా దివ్యాంగ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజను.. ఇతర అధికారులను పంజాబ్ కు పంపిన మంత్రి కేటీఆర్.. ఆమెను ప్రగతిభవన్ కు తీసుకొచ్చారు. తన కార్యాలయంలో ఆమెను కలిసి రూ.15 లక్షల ఆర్థిక సాయాన్ని.. ఒక ల్యాప్ టాప్ ను ఆమెకు అందించారు.

అదే సమయంలో కేంద్ర నుంచి ఆమెకు సాయం అందాలని కోరుతూ కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కోరారు. పంజాబ్ క్రీడాకారిణిని ఆదుకోవటానికి ప్రజాసొమ్మును వాడకుండా.. సొంత సొమ్మును వాడిన కేటీఆర్ తీరును తప్పనిసరిగా అభినందించాల్సిందే. అక్కడెక్కడో పంజాబ్ లో ఉన్న క్రీడాకారిణి వేదనను తీర్చే ప్రయత్నం చేసిన మంత్రి కేటీఆర్ తన తాజా చర్యతో కేంద్రం కంటే తామే అలెర్టుగా ఉన్నామన్న సందేశాన్ని పంపినట్లు అనిపించట్లేదు?