Begin typing your search above and press return to search.

కేటీఆర్.. మ‌మ‌తా తెలంగాణ ఎందుకు రారు?

By:  Tupaki Desk   |   1 April 2019 6:19 AM GMT
కేటీఆర్.. మ‌మ‌తా తెలంగాణ ఎందుకు రారు?
X
సారు.. కారు.. ప‌ద‌హారు అంటూ రిథ‌మిక్ నినాదంతో తెలంగాణ‌లోని ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ (స్నేహితుడు మ‌జ్లిస్ సీటును కలుపుకొని) చేయాల‌ని ఆశ ప‌డుతున్న కేసీఆర్ కు త‌గ్గ‌ట్లే.. గులాబీ నేత‌లు ఇప్పుడు ప‌ద‌హారు చుట్టూనే తిరుగుతున్నారు. ప‌ద‌హారు మీద పెట్టుకున్న ఆశ‌ల్ని వ‌మ్ము చేసే సంకేతాలు ఎల్ బీ స్టేడియం స‌భ ఇవ్వ‌టంతో అలెర్ట్ అయిన కేసీఆర్‌.. ఇప్పుడు మ‌రింత అలెర్ట్ గా ఉండ‌ట‌మే కాదు.. ఎవ‌రి నిర్ల‌క్ష్యాన్ని తాను ఉపేక్షించ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము ప్ర‌చారం చేస్తున్న ప‌ద‌హారు సీట్లతో చ‌క్రం తిప్పే మాట‌ల‌కు ద‌న్నుగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవ‌ల ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్.. మ‌మ‌త‌.. అఖిలేశ్‌.. మాయావ‌తి.. ఇలా చాలామంది నేత‌లు త‌మ వెనుక‌నే ఉన్న‌ట్లు చెప్పారు. కేటీఆర్ మాట‌లే నిజ‌మ‌ని అనుకుంటే.. ఏపీలో మాదిరి తెలంగాణ‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క అధినేత ఎందుకు రాలేదు? కేసీఆర్ తో జ‌ట్టు క‌ట్టి.. కేంద్రంలో చ‌క్రం తిప్పేది తామేనంటూ ఎందుకు ప్ర‌చారం చేయ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌.

టీఆర్ ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌టానికి కేసీఆర్ స‌రిపోతారు. ఆ పార్టీ కోసం ప్ర‌త్యేకంగా ఎవ‌రూ రావాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతాం.. అది కూడా 16 ఎంపీ సీట్ల‌తో అన్న మాట‌ల్ని అదే ప‌నిగా చెబుతున్న‌ప్పుడు.. అదెలా అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. రెండు సీట్లు ఉన్న వేళ తెలంగాణ‌ను సాధించిన కేసీఆర్‌.. ప‌ద‌హారు సీట్ల‌తో కేంద్రంలో చ‌క్రం తిప్ప‌టం పెద్ద విష‌యం కాదంటూ కొంద‌రు టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నా.. అప్ప‌టికి ఉద్య‌మానికి.. ఇప్ప‌టి ప్ర‌భుత్వానికి పోలిక లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ ఉద్య‌మం జ‌రుగుతున్న వేళ‌.. వివిద రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురిని స‌భ‌ల‌కు ఆహ్వానించే వారు. వారొచ్చి తెలంగాణ‌కు తాము సానుకూల‌మ‌ని చెప్పేవాళ్లు. తెలంగాణ సాధ‌న కోసం ప‌లువురు జాతీయ నాయ‌కుల్ని తెచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎందుకు తేవ‌టం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. మ‌రో నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలో కేంద్రంలో చ‌క్రం తిప్ప‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే ప్ర‌ధాని కుర్చీలో కేసీఆర్ కూర్చున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పే గులాబీ నేత‌ల బ‌డాయి మాట‌లు నిజ‌మే అనుకుందాం.

అలాంట‌ప్పుడు కేసీఆర్ చెప్పిన మాట‌లు నిజ‌మేనంటూ.. ఏ ఒక్క జాతీయ‌నాయ‌కుడు ఎందుకు మాట్లాడ‌టం లేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. కేటీఆర్ తాజాగా చెప్పిన జాబితాలో ఉన్న మ‌మ‌త ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబు త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నారు. అదే జాబితాలో ఉన్న మాయాప‌తి ఏపీలో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు కేసీఆర్ ను విమ‌ర్శ‌ల‌తో ఉతికి ఆరేస్తున్నారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ తో క‌లిసి పోతాన‌ని చెబుతున్న జ‌గ‌న్ త‌ప్పించి మ‌రే నేత కూడా కేసీఆర్ తో జ‌ట్టు క‌డ‌తామ‌ని చెప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. కేటీఆర్ చెబుతున్న‌ట్లుగా కేంద్రంలో చ‌క్రం తిప్పే ప‌రిస్థితి ఉందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.