Begin typing your search above and press return to search.

జాద‌వ్ ను బ‌లూచ్ లో అరెస్టు చేయ‌లేదా?

By:  Tupaki Desk   |   29 Dec 2017 4:21 PM GMT
జాద‌వ్ ను బ‌లూచ్ లో అరెస్టు చేయ‌లేదా?
X
గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల‌తో పాకిస్థాన్ లో మ‌ర‌ణశిక్ష ఎదుర్కొంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. జాద‌వ్ త‌మ దేశంపై గూఢ‌చ‌ర్యం చేశాడ‌ని, త‌మ దేశానికి సంబంధించిన కీలక‌మైన స‌మాచారాన్ని సేక‌రించాడ‌ని పాక్ ఆరోపిస్తోంది. త‌మ దేశంలోకి జాద‌వ్ అక్రమంగా చొర‌బ‌డ్డాడ‌ని, అందుకే జాద‌వ్ ను బలూచిస్థాన్ లో అరెస్టు చేశామ‌ని పాక్ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో జాద‌వ్ అరెస్టుపై బ‌లూచ్ నేత ఒక‌రు సంచ‌ల‌న వాస్త‌వాలు వెల్ల‌డించారు. అసలు జాద‌వ్ ను బలూచిస్థాన్ లో అరెస్టు చేయనేలేదని ఆ ప్రాంత నేత హిర్బయేర్‌ మారీ చెప్పారు. జాద‌వ్ ను ఇరాన్‌ నుంచి బ‌ల‌వంతంగా కిడ్నాప్‌ చేసి పాక్ కు తీసుకొచ్చారని ఆయ‌న లిపారు.

జాద‌వ్ కిడ్నాప్ వెనుక పాక్ కు చెందిన అతివాద మ‌త‌ప‌ర‌మైన సంస్థలు ఉన్నాయ‌న్నారు. అవి ఇరాన్‌ నుంచి జాద‌వ్ ను తీసుకొచ్చాయ‌ని, గతంలో కూడా ఇలా చాలామందిని తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. అఫ్గాన్ లోని బలోచ్‌ శరణార్థులను కూడా వారు అపహరించి ఐఎస్‌ ఐ లేదా పాక్‌ సైన్యానికి అమ్మి సొమ్ము చేసుకుంటుంటార‌ని తెలిపారు. 1970 - 80ల్లో బలోచ్‌ శరణార్థుల తలలను నరికి ఆ ఫొటోలను ఐఎస్‌ ఐ లేదా పాక్‌ సైన్యానికి పంపి తాలిబన్‌ ఉగ్రవాదులు డ‌బ్బులు సంపాదించేవార‌ని చెప్పారు. జాద‌వ్ త‌ల్లి - భార్య‌పై పాక్ దురాగ‌తాన్ని ప్రపంచం మొత్తం చూసింద‌ని, అటువంటిది బలోచ్‌ మహిళల పట్ల పాక్‌ ఎంత క్రూరంగా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పన‌వ‌స‌రం లేద‌ని అన్నారు. బలోచ్‌ ఖైదీలు - మహిళలు - చిన్నారుల పట్ల పాక్ అమాన‌వీయంగా ప్ర‌వర్తిస్తుంద‌న్నారు.

అంతేకాకుండా, పాక్ లో ఖైదీలను వేధించేందుకు రహస్య జైళ్లున్నాయ‌ని, అక్క‌డ విచార‌ణ స‌మ‌యంలో ఖైదీలు ఏవిధంగా చనిపోతారో ఎవ‌రికీ తెలీద‌న్నారు. పాక్ సెనేట‌ర్ ఒక‌రు ఈ జైళ్ల గురించి ఇటీవ‌ల వ్యాఖ్యానించార‌ని, అక్క‌డి సుప్రీం కోర్టు - పార్ల‌మెంటు ల‌కు కూడా ఆ టార్చ‌ర్ సెల్స్ గురించి తెలుస‌ని చెప్పారు. కానీ, వాటి గురించి బ‌య‌ట పెట్ట‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌ర‌ని చెప్పారు. పాక్ ను న‌మ్మి తాము చాలా మోస‌పోయామ‌ని - అది ఒక విష స‌ర్పం వంటిద‌ని అన్నారు. పాక్ వంటి విష స‌ర్పానికి ఎవ‌రు పాలు పోసి పోషించినా....వారి చేతిని కాటేయ‌డం ఖాయ‌మ‌ని మారీ అభిప్రాయ‌ప‌డ్డారు.