Begin typing your search above and press return to search.

సీఎంగారు..నేను చ‌చ్చిపోయానంటున్న ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   4 Jan 2018 8:07 AM GMT
సీఎంగారు..నేను చ‌చ్చిపోయానంటున్న ఎమ్మెల్యే
X
ఆమ్ ఆద్మీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీపార్టీలో ఢిల్లీ రాజ్యసభ సీట్ల వ్యవహారంఒక్కసారిగా అగ్గిని రాజేసింది. మూడు రాజ్యసభ స్థానాలకు పార్టీ బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తోపాటు - చార్టర్డ్ అకౌంటెంట్ నారాయణ్‌ దాస్ గుప్తా - విద్యావేత్త సుశీల్‌ గుప్తాలను రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ ఎంపిక చేసినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఆప్ వ్యవస్థాపక సభ్యుడు కుమార్ విశ్వాస్ కూడా రాజ్యసభ సీటును ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు.

ఈ జాబితాలో పేరు లేక‌పోవ‌డంతో కుమార్‌విశ్వాస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పై బహిరంగంగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొసగకపోయినప్పటికీ పార్టీలో కలిసి ముందుకుసాగడం సాధ్యంకాదని విశ్వాస్ అన్నారు. వాస్తవాలు మాట్లాడినందుకే తనను శిక్షించారని, ఇలా చేస్తారని తనకు ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ మాట వినని వారికి ఆమ్ ఆద్మీ పార్టీలో మనుగడ లేదని చెప్పారు. `నిన్ను రాజకీయంగా అంతమొందిస్తాను కానీ అమరుడిని కానివ్వబోను అని ఏడాదిన్నర క్రితం పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ నాతో నవ్వుతూ అన్నారు. ఆయన అలాగే చేశారు. డియర్ అరవింద్!.. ఇప్పుడు నేను చనిపోయినవాడిని. నా బలిదానాన్ని స్వీకరిస్తున్నాను. నా శరీరంతో ఆటలాడి, దుర్వాసన వ్యాపింపజేయొద్దు` అని వ్యాఖ్యానించారు.

కాగా, కుమార్ విశ్వాస్ మద్దతుదారులు పార్టీ ఆఫీసు ముందు పెద్దఎత్తున నిరసనకు దిగారు. తమ నేతను పార్లమెంటుకు పంపించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు జనవరి 16న ఎన్నికలు జరుగనున్నాయి. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ప్రకటించ‌గా...70మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నందున ఆప్ అభ్యర్థులు సునాయాసంగా గెలువనున్నారు.