Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తీరుపై కుమార‌స్వామి తీవ్ర అసంతృప్తి?

By:  Tupaki Desk   |   19 May 2018 4:23 AM GMT
కాంగ్రెస్ తీరుపై కుమార‌స్వామి తీవ్ర అసంతృప్తి?
X
ఏం చేసైనా స‌రే.. క‌న్న‌డ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌న్న మొండిప‌ట్టుద‌ల‌తో బీజేపీ ఉంది.ఆ పార్టీ బాట‌లోనే కాంగ్రెస్‌.. జేడీఎస్ లు న‌డుస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. తాజాగా ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాంగ్రెస్‌.. జేడీఎస్ ల‌ను దెబ్బే తీసేలా బీజేపీ నేత‌లు క‌దిపిన పావులు కొంత‌మేర వ‌ర్క్ వుట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని బుట్ట‌లో వేసుకునేందుకు తెర వెనుక జోరుగా సాగుతున్న ప్ర‌య‌త్నాలు కొంతమేర ఫ‌లించ‌ట‌మే కాదు.. కాంగ్రెస్‌.. జేడీఎస్ పార్టీల మ‌ధ్య చిచ్చు పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ పార్టీకి చెందిన నేత‌లు ఎవ‌రూ చేజారిపోకుండా తాము చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పిన కుమార‌స్వామి.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి కాంగ్రెస్ లో నెల‌కొంద‌న్న ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తాజ్ కృష్ణ హోట‌ల్లో నిర్వ‌హించిన కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశానికి కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజ‌రు అయిన‌ట్లుగా తెలుసుకున్న కుమార‌స్వామి తీవ్ర అసంతృప్తికి గురైన‌ట్లుగా స‌మాచారం.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారంటూ ఆ పార్టీ అధినాయ‌క‌త్వంతో సీరియ‌స్ గా మాట్లాడిన కుమార‌స్వామి తీవ్ర అసంతృప్తితో తాజ్ కృష్ణ నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నోవాటెల్‌కు వెళ్లిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. మీ ఎమ్మెల్యేల్ని మీరు కాపాడుకోలేక‌పోతున్నారు.. జాగ్ర‌త్త‌గా ఉండే మంచిది అంటూ మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌.. ప‌ర‌మేశ్వ‌ర‌ల‌కు కుమార‌స్వామి సూచ‌న చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ కు చెందిన 8 మంది లింగాయ‌త్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చుక్క‌లు చూపిస్తున్నార‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తాజ్ కృష్ణ‌లో జ‌రిగిన పార్టీ స‌మావేశానికి మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లంతా సీరియ‌స్ గా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ నేత‌ల తీరు ఇలా ఉంటే.. జేడీఎస్ నేత‌లు మాత్రం ఒకే క‌ట్టుగా ఉన్న‌ట్లుగా క‌నిపించింది. వారు బ‌స చేసిన నోవాటెల్ లో పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు ఒక‌రిద్ద‌రు నోవాటెల్ మొత్తాన్ని ప‌హారాకు పెట్ట‌ట‌మే కాదు.. ప్ర‌త్యేక వాహ‌నాల్లో ప‌లుమార్లు త‌నిఖీలు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. త‌మ నేత‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకు బ‌య‌ట‌వాళ్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ తో పోలిస్తే.. జేడీఎస్ నేత‌ల్లో పోరాట స్ఫూర్తి ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్లుగా ప‌లువురు అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.