Begin typing your search above and press return to search.

సుమలతకు సీఎం క్షమాపణ

By:  Tupaki Desk   |   11 March 2019 8:05 AM GMT
సుమలతకు సీఎం క్షమాపణ
X
దివంగత రెబల్ స్టార్, మాజీ మంత్రి అయిన కన్నడ హీరో అంబరీష్ భార్య సుమలతకు కర్ణాటక సీఎం కుమారస్వామి బహిరంగ క్షమాపణ చెప్పారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన కుమారస్వామి.. సుమలతను కించపరిచేలా మాట్లాడిన కర్ణాటక ప్రజాపనుల శాఖ మంత్రి రేవణ్ణ తీరును తప్పుపట్టారు. ఆయన తరుఫున తాను క్షమాపణలు చెబుతున్నట్టు వివరించారు. మా కుటుంబం మహిళలకు అవమానం చేయదన్నారు.

ఇటీవలే కర్ణాటక మంత్రి రేవణ్ణ.. సుమలతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భర్త చనిపోయి రెండు నెలలు కూడా కాకముందే అప్పుడే సుమలతకు రాజకీయాలు అవసరమా?’ అని నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపాయి. దీంతో సీఎం కుమారస్వామి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై వివరణ కోరగా ఆయన సారీ చెప్పారు. ఇక సుమలతకు టికెట్ ఇవ్వకుండా సీఎం కుమారుడు నిఖిల్ ను మాండ్య నుంచి బరిలో నిలబెట్టారు. నిఖిల్ కూడా మాండ్యలో విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి రేవణ్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సుమలతకు క్షమాపణలు చెప్పారు. జేడీఎస్ పార్టీ మహిళలంటే ఎనలేని గౌరవం ఇస్తుందని తెలిపారు.

ఇక నటి సుమలతపై మంత్రి రేవణ్ణ వ్యాఖ్యల కలకలం కన్నడ నాట తగ్గలేదు. కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవణ్ణ ఒక సీనియర్ నాయకుడు అయ్యి ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందని.. ఉద్వేగానికి లోను కారాదని సంయమనంతో మాట్లాడాలని హితవు పలికారు. అదుపు తప్పితే ఇవే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అస్త్రాలవుతాయని.. ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వవద్దని హితవు పలికారు. మొత్తంగా సుమలతపై నోరు జారి ఇప్పుడు జేడీఎస్ పార్టీయే ఎన్నికల వేళ ఇరుకునపడింది.