Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క రెండో రాజ‌ధాని అదేన‌ట‌!

By:  Tupaki Desk   |   2 Aug 2018 4:50 AM GMT
క‌ర్ణాట‌క రెండో రాజ‌ధాని అదేన‌ట‌!
X
ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం అంత‌కంత‌కూ పెరుగుతున్న విభ‌జ‌న ఉద్య‌మానికి చెక్ పెట్టేందుకు వీలుగా క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి చ‌క‌చ‌కా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లోని ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని నీరుకార్చేలా.. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా రెండో రాజ‌ధానిగా బెళ‌గావి న‌గ‌రాన్ని ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

దీనికి సంబంధించి త్వ‌ర‌లో అధికార ప్ర‌క‌ట‌న‌ను చేయ‌టానికి క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్ని నిర్వహించ‌టంతో పాటు.. ప‌లు అంశాల్లో బెళ‌గావిని రెండో రాజ‌ధానిగానే భావిస్తున్నారు. గ‌తంలో (2006) బీజేపీ-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్ర‌భుత్వం సైతం బెళ‌గావికి రెండో రాజ‌ధాని హోదా ఇస్తూ తీర్మానం చేశారు.

అనంత‌రం సంకీర్ణ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌టంతో రెండో రాజ‌ధాని అంశం ప‌క్క‌కు వెళ్లిపోయింది. తాజాగా ప్ర‌త్యేక రాష్ట్ర డిమాండ్ తెర మీద‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో రెండో రాజ‌ధాని అంశాన్ని అధికారికంగా తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల‌న్న ఆలోచ‌న‌లో కుమార‌స్వామి ఉన్నారు.

బెళ‌గావిని రెండో రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. బెంగ‌ళూరులోని కొన్ని పాల‌నా కార్యాల‌యాల్ని బెళ‌గావికి త‌ర‌లించాల‌న్న ఆలోచ‌న‌లో కుమార‌స్వామి ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర బ‌డ్జెట్ లోనూ.. మంత్రివ‌ర్గ కూర్పులోనూ త‌మ ప్రాంతానికి తీర‌ని అన్యాయం జ‌రిగిన‌ట్లుగా విభ‌జ‌న వాదులు వాదిస్తున్నారు.

త‌మ డిమాండ్ల‌ను తెర మీద‌కు తీసుకొస్తూ.. నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టానికి వీలుగా ఈ రోజు (గురువారం) రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.

ఉత్త‌ర క‌ర్ణాట‌క ప్ర‌త్యేక రాజ్య పోరాట స‌మితి నేత‌లు కుమార‌స్వామిని క‌లిసి.. ప్ర‌త్యేక రాష్ట్ర డిమాండ్‌ ను ఆయ‌న ముందు పెట్ట‌గా.. ఆయ‌న అందుకు స‌సేమిరా అని తేల్చేశారు. గొడ‌వ‌లు పెట్టేందుకు బీజేపీ నేత‌లు ఏదేదో ప్ర‌చారం చేస్తార‌ని.. వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని.. వారి మాయ‌లో ప‌డొద్దంటూ స్ప‌ష్టం చేశారు. ఉత్త‌ర క‌ర్ణాట‌క‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ తో రెచ్చ‌గొట్టే ప్ర‌సంగం చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ ఎమ్మెల్యే శ్రీ‌రాములుపై బెంగ‌ళూరులోని మ‌ల్లేశ్వ‌రం పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. మొత్తానికి ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని మొద‌ట్లోనే తుంచేలా కుమార‌స్వామి వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నార‌నే చెప్పాలి.