Begin typing your search above and press return to search.

కొడుకు ఓటమిని గుర్తు చేసి మరీ కన్నీరు పెట్టిన మాజీ సీఎం

By:  Tupaki Desk   |   28 Nov 2019 5:23 AM GMT
కొడుకు ఓటమిని గుర్తు చేసి మరీ కన్నీరు పెట్టిన మాజీ సీఎం
X
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అదే పనిగా కన్నీరు పెట్టుకునే నేతగా గుర్తింపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికే సొంతం.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నే చూడండి..కన్నీళ్లు పెట్టిస్తారే కానీ.. కన్నీరు కంట రాని మొండితనం ఆయన సొంతం. ఆ మాటకు వస్తే.. చాలామంది ముఖ్యమంత్రులు కఠినంగా వ్యవహరిస్తారు. కానీ.. కుమారస్వామి అలా కాదు. చిన్నపిల్లాడిలా తరచూ కన్నీళ్లు పెట్టేసుకుంటారు.

ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు కన్నీరు పెట్టుకున్న ఆయన.. మాజీ అయ్యాక కూడా తన అలవాటును అస్సలు ఆపుకోలేకపోతున్నారు. తాజాగా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మరోసారి కన్నీరు పెట్టేసుకోవటంతో అవాక్కు అయ్యారు. ఎందుకలా? అంటే.. ఆయన చెప్పిన రీజన్ అలాంటిది మరి.

ఆర్నెల్ల క్రితం జరిగిన మండ్య లోక్ సభ ఎన్నికల్లో తన కొడుకు నిఖిల్ ఓటమిని తలుచుకొని మరీ ఆయన కన్నీరు పెట్టారు. జేడీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కుమారస్వామి.. ప్రస్తుతం అక్కడ జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. అకస్మాత్తుగా కంటతడి పెట్టుకున్నారు.

నేనేం తప్పు చేశాను.. మండ్య ప్రజలనే నమ్ముకున్నాను. మీరే నన్ను దూరం పెడితే ఎలా? అంటూ తాను భావోద్వేగానికి గురై.. పార్టీ నేతల్ని ఆ దిశగా నడిపే ప్రయత్నం చేశారు. పార్టీ పెద్ద దిక్కు కన్నీరు పెట్టటంతో పార్టీ నేతలు ఆయన్ను సముదాయించారు. కుమారస్వామి కన్నీళ్ల రాజకీయాలు ఎప్పటివరకో అంటూ నిట్టురుస్తారు ఆ పార్టీ నేతలు. మరి.. తాజాగా ఆయన పెట్టుకున్న కన్నీళ్లు ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయా? అన్నది చూడాలి.