Begin typing your search above and press return to search.

ఇద్దరు సీఎంల తనయులు.. గెలుపు విషయంలో సంధిగ్ధమే!

By:  Tupaki Desk   |   29 April 2019 2:30 PM GMT
ఇద్దరు సీఎంల తనయులు.. గెలుపు విషయంలో సంధిగ్ధమే!
X
దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తుల తనయులు ఒకేసారి ఎన్నికల రణరంగంలోకి దిగడం ఆసక్తిదాయకమైన అంశమే. వీరిలో ఒకరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే నామినేటెడ్ పదవితో మంత్రిగా వ్యవహరించారు. మరొకరు ముందుగా సినిమాల్లో ట్రై చేసి ఆ తర్వాత పార్టీలో కొంత పని చేసి.. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.

వారిద్దరూ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వారిలో ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బాబు, మరొకరు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి. లోకేష్ బాబు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే - నిఖిల్ కుమారస్వామి ఎంపీగా బరిలోకి దిగారు.

విశేషం ఏమిటంటే.. వీరి విజయం విషయంలో కూడా ఒకేరకమైన సంధిగ్ధం నెలకొంది. ముఖ్యమంత్రుల తనయులు.. అనే ట్యాగ్ వీళ్ల విజయాన్ని సులభతరమే అనేలా చేస్తున్నా - బలమైన ప్రత్యర్థులు - నియోజకవర్గాల పరిస్థితులు వీరి విజయాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నాయని పరిశీలకులు అంటూ ఉన్నారు.

మండ్యలో నిఖిల్ కుమారస్వామికి ఇండిపెండెంట్ అభ్యర్థి రూపంలో బలమైన పోటీ ఎదురైంది. సుమలత రూపంలో నిఖిల్ కు ఒక బలమైన ప్రత్యర్థి ఎదురయ్యారు. ఆమెకు అక్కడ అనేక సానుకూలాంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమలత భర్త దివంగత అంబరీష్ కు ఆ ప్రాంతం ఆటపట్టైంది. ఆ ప్రాంతాన్ని అంబరీష్ సొంతూరిగా ఓన్ చేసుకున్నారు. అక్కడి జనాలు కూడా అంబీని తమ వాడు అనుకున్నారు. అలాంటి అంబీ మరణంతో సుమలతపై అక్కడ సానుభూతి వెల్లువెత్తింది.

ఇక ఆమెకు బీజేపీ అధికారిక మద్దతు - కాంగ్రెస్ పార్టీ లోపాయి కారీ మద్దతు.. వంటివి కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సానుభూతి ప్లస్ ఇతర కారణాలతో సుమలత నెగ్గవచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే జేడీఎస్ కు అది అనుకూల ప్రాంతం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అక్కడ స్వీప్ చేసింది. ఇది ఒకటీ నిఖిల్ కు అనుకూలాంశంగా నిలుస్తోంది. ఏతావాతా విజయం పై సంధిగ్ధావస్థ నెలకొంది.

మరోవైపు లోకేష్ పరిస్థితి కూడా కాస్త ఇలాగే ఉంది. లోకేష్ కు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురవుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా కనిపిస్తూ ఉంది. ఇక చాలా కాలంగా అక్కడ తెలుగుదేశం నెగ్గింది కూడా లేదు. సీఎం తనయుడు అనే ట్యాగ్ తప్ప అక్కడ లోకేష్ కు మరే ప్లస్ పాయింట్ కనిపించడం లేదు. ఇక ప్రచారంలో జరిగిన రసాభస తెలిసిన సంగతే.

ఇలాంటి నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్ విజయం తేలికగా ఏమీ కనిపించడం లేదు. ఇలా కర్ణాటక సీఎం తనయుడు - ఏపీ సీఎం తనయుడు ఒకే రకమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఎన్నికలతో కుమారస్వామి పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఏపీలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగుతున్నాయి కాబట్టి.. చంద్రబాబు నాయుడుకు కూడా పరీక్ష ఎదురవుతోంది!