Begin typing your search above and press return to search.

కుప్పం కొన్ని రాజ‌కీయాలు.. కొన్ని పంతాలు..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:29 AM GMT
కుప్పం కొన్ని రాజ‌కీయాలు.. కొన్ని పంతాలు..!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ కవ‌ర్గం అనూహ్యంగా వార్త‌ల్లోకి ఎక్కింది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం..ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకోవ‌డం.. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అస‌లు కుప్పంలో జ‌రుగుతున్న రాజ‌కీయం ఏంటి? ఎందుకు ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధానంగా టార్గెట్ అవుతోంది? అనేది ఆస‌క్తిగా మారింది. టీడీపీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూస్థాపితం చేయాల‌నేది అధికార పార్టీ వైసీపీ లక్ష్యంగా ఉంది. రాజ‌కీయాల్లో ఇది కామ‌నే. పొరుగున ఉన్న కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అంతెందుకు.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా వైసీపీని భూస్థాపితం చేస్తామ‌ని.. జ‌గ‌న్‌ను పులివెందుల గ‌డ్డ‌పై ఓడించి తీరుతామ‌ని.. ఈసారి వైసీపీకి సున్నానేన‌ని వ్యాఖ్యానించారు. అనంత‌రం కొన్ని చ‌ర్య‌లు కూడా తీసుకున్నారు. పులివెందుల‌కు ప‌ట్టిసీమ ద్వారా నీళ్లు ఇప్పించారు. అదేవిధంగా క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంకుస్థాప‌న కూడా చేశారు. అయిన‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీని ఆయ‌న అడ్డుకోలేక పోయారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే పంతంతో ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని లేకుండా చేయాల‌ని.. ముఖ్యంగా చంద్ర‌బాబు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ట్టిక‌రిపించాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్‌-కుప్పం పేరుతో చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ఇక్క‌డ చేస్తున్న అభివృద్ది వంటివాటిని ప్ర‌త్యేకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌నే ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కీల‌క‌మైన ఇద్ద‌రు నాయ‌కుల‌ను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రెడ్డ‌ప్ప‌ల‌ను నియ‌మించి.. పులివెందుల‌కు తీసిపోని విధంగా కుప్పంను అభివృద్ధి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నా.. కుప్పంలో మాత్రం అద్దంలా మెరిసిపోతున్నాయి.

రాష్ట్రంలో పింఛ‌న్లు 1వ తారీకు ఉద‌యం 5 గంట‌ల‌కు ప్రారంభ‌మై మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు సాగుతుంటే.. కుప్పంలో మాత్రం తెల్ల‌వారు జామున 4 నుంచి ప్రారంభ‌మై 7 గంట‌ల‌కే పూర్తి చేస్తున్నారు. ఇదంతా కూడా చంద్ర‌బాబునుదృష్టిలో పెట్టుకుని చేస్తున్న‌దే. అయితే.. ఇంత చేస్తున్నా.. వైసీపీలో ఎక్క‌డో ఆందోళ‌న‌, ఆవేద‌న పెల్లుబుకుతోందా? అన్న‌ట్టుగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట న‌ల‌కు అడుగ‌డుగునా అడ్డుప‌డ‌డం.. అనుమ‌తుల పేరుతో వేదించ‌డం వంటివి.. వైసీపీ వైపు త‌ప్పుల‌ను ఎత్తి చూపుతున్నాయి.

ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు. నిర్బంధంగానో.. భ‌యోత్పాతంగానో.. ఓట్లు వేయించే ప‌రిస్థితి లేదు. ఈ చిన్న విష‌యం లో వైసీపీ చేస్తున్న త‌ప్పులు.. కుప్పం ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. గ‌డిచిన మూడు ద‌శాబ్దాలుగా ప్ర‌శాంతంగా ఉన్న కుప్పం ప‌ల్లెలు ఇప్పుడు రాజ‌కీయం మాట్లాడాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారిపోయాయి. ఇదే విధానం కొన‌సాగితే.. వైసీపీ ల‌క్షిత రాజ‌కీయం నెర‌వేర‌క‌పోగా.. టీడీపీకి మేలు చేసిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.