Begin typing your search above and press return to search.

చంద్రబాబు నియోజకవర్గం లో ‘పంచాయతీ’

By:  Tupaki Desk   |   31 July 2016 7:00 AM GMT
చంద్రబాబు నియోజకవర్గం లో ‘పంచాయతీ’
X
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన మేజర్ పంచాయతీ కుప్పంలో టీడీపీలో అనిశ్చితి నెలకొంది. కుప్పం పాలకవర్గంలోని నేతల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా కుప్పంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే ఆ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీ నేతలను కలవరపెడుతోంది.

కుప్పం సర్పంచ్ వెంకటేష్ తీరును నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన పంచాయతీ ఉప సర్పంచ్ సుధాకర్‌ తోపాటు మరో 15 మంది తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీరంతా శనివారం కలెక్టర్ ను కలిసి కుప్పం పంచాయతీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. తమపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి వార్డు సభ్యులుగా గెలిపించినా సర్పంచ్ తీరు కారణంగా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. అభివృద్ధి పనుల్లో భారీగా కుంభకోణాలకు పాల్పడ్డారంటూ సర్పంచిపై ఆరోపణలు చేశారు.

కాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలోనే పార్టీ నాయకులు ఇలా వీధికెక్కడం చర్చనీయంగా మారింది. ఏదైనా సమస్య ఉన్నా దాన్ని పార్టీలోనే పరిష్కరించుకోకుండా రాజీనామాల వరకు వెళ్లడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషయం రచ్చరచ్చగా మారడంతో కుప్పం ‘పంచాయతీ’ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే.. ఈ పని ముందే చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని వినిపిస్తోంది. అదేసమయంలో.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంపై దృష్టిపెడితే పరిస్థితులు ఇంత దరిద్రంగా ఉండేవి కావన్న వాదనా వినిపిస్తోంది.