Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఇంకెంత మందిని చంపుతారు: కుప్పం వైసీపీ నేత ఫైర్‌

By:  Tupaki Desk   |   4 Jan 2023 6:00 PM GMT
చంద్ర‌బాబు ఇంకెంత మందిని చంపుతారు:  కుప్పం వైసీపీ నేత ఫైర్‌
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు జీవో 1/2023 ద్వారా ఎక్క‌డిక‌క్క‌డ అడ్డంకులు సృష్టించారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌చార రథాన్ని కూడా స్వాధీనం చేసుకుని, డ్రైవ‌ర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రిణామాలు ఒక‌వైపు రాజ‌కీయంగా సెగ పుట్టిస్తుంటే.. మ‌రోవైపుకుప్ప వైసీపీ ఇంచార్జ్ కేఆర్‌జే భ‌ర‌త్ చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే టీడీపీ రాజకీయమా.. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లకు ప్రజలు బలైపోవాల్సిందేనా అని భరత్ మండిపడ్డారు.

కందకూరు, గుంటూరు ఘటనల దారుణం మరవక ముందే కుప్పంలో చంద్రబాబు పర్యటన సాగించడం దారుణమని భ‌ర‌త్ అన్నారు. ప్రజల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని చంద్రబాబు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్ర‌శ్నించారు. 11 మంది అమాయకుల మృతికి కారణమైన చంద్రబాబు ఇంకెంత మందిని చంపాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నారు. రోడ్ షోలు, డ్రోన్ విజువల్స్ పేరుతో రాష్ర్టంలో దారుణమైన రాజకీయ పబ్లిసిటీకి చంద్రబాబు తెరతీశారని విమర్శించారు.

చంద్రబాబు కుప్పం పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటోందన్న టీడీపీ ఆరోపణలు స‌రికావ‌ని భరత్ అన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు అన్నట్లు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదే నేర్పిందా అని ప్రశ్నించారు. ప్రచార సభలు, రోడ్ షోల పేరుతో ఇంకెంత మందిని ప్రాణాలను బలి ఇవ్వాలను కుంటున్నారని మండిపడ్డారు.

కుప్పంలో టీడీపీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారన్న‌ ప్రచారం అవాస్తవమని తెలిపారు. టీడీపీ నిర్వహిస్తున్న సభకు సంబంధించి ఎక్కడ, ఎలాంటి భద్రతా ప్రమాణాలు తీసుకున్నారో చెప్పాలని జిల్లా యంత్రాంగం, పోలీసులు అడిగారని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల ప్రశ్నలకు మంగళవారం నాడు అర్ధరాత్రి వరకు వేచి చూసినా టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. పూర్తి సమాచారం అందించిన తరువాతే సభకు అనుమ‌తి ఇస్తామని పోలీసులు చెప్పార‌ని పేర్కొన్నారు.

కందకూరు, గుంటూరు ఘటనల్లో మరణించిన వారి ఆత్మలు కూడా శాంతించకుండా ఏం చేద్దామని చంద్రబాబు కుప్పం పర్యటనకు బయలుదేరారో రాష్ర్ట ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ భ‌ర‌త్‌ డిమాండ్ చేశారు. ఘటన జరిగి వారం కూడా కాకుండానే కుప్పం సభ నిర్వహిస్తున్న చంద్రబాబుకు ప్రజల ప్రాణాలపై బాధ్యత ఉందో తెలుస్తోందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలో ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించడం ఉద్దేశ్యం కాదని ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు.

రాజకీయ పార్టీ నిర్వహించే ర్యాలీలు, ప్రచార సభల్లో బాధ్యతను పెంచుతూ ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించే అంశాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభల్లో అవసరమైన సౌకర్యాలు, జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు తీసుకుని సభ నిర్వహించాలని సూచించే మార్గదర్శకాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల భద్రత కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.