Begin typing your search above and press return to search.

ఒకప్పుడు చిరు విధేయుడు.. తాజా మంత్రి పవన్ మీద సీరియస్ అయ్యారు

By:  Tupaki Desk   |   3 Oct 2021 6:30 AM GMT
ఒకప్పుడు చిరు విధేయుడు.. తాజా మంత్రి పవన్ మీద సీరియస్ అయ్యారు
X
రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అన్నోళ్లు ఉండరు. ఇవాల్టి రోజున ఎంతో దగ్గరగా ఉన్నోళ్లు.. తర్వాత ఆగర్భ శత్రువులుగా మారిపోతుంటారు. ఇలాంటి తీరు రాజకీయాల్లో తప్పించి మరే రంగంలోనూ ఇంతలా కనిపించదు. ఎవరిదాకానో ఎందుకు.. ఏపీ మంత్రి కురసాల కన్నబాబునే తీసుకోండి.. ఈనాడులో ఒక రిపోర్టర్ గా ఆయన ప్రయాణం మొదలైంది. స్టేట్ బ్యూరోలో ‘పవర్’ (విద్యుత్ శాఖ)ను చూసే రిపోర్టర్ గా చాలా సుపరిచితులు. జిల్లాల్లో పని చేసి వచ్చి.. హైదరాబాద్ లో స్టేట్ బ్యూరో లో ఆయన ప్రయాణం మొదలైన కొన్నాళ్లకు.. కులం కార్డుతో చిరు క్యాంప్ లోకి ఎంట్రీ ఇచ్చారని చెబుతారు.

ఇదెంతవరకు నిజమన్న దానిపై సందేహం ఏమైనా ఉంటే.. చిరంజీవి తాను పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ప్రాథమిక పనుల్లో మమేకమై.. పార్టీ ప్రకటనలో కీలక భూమిక పోషించారు. అంతదాకా ఎందుకు.. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభ సభ తిరుపతిలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. చిరంజీవి తన పార్టీ పేరును ప్రకటించే క్రమంలో ఒక్కసారిగా స్టేజ్ మీదకు వచ్చి.. చిరు చెవిలో ఏదో చెప్పటం.. ఆయన కాసేపు ఆగిన తర్వాత పార్టీ పేరును..జెండాను ప్రకటించటం గుర్తుండే ఉంటుంది. నాడు స్టేజ్ మీదకు వచ్చి.. చిరు చెవిలో ఏదో చెప్పింది మరెవరో కాదు.. ఇప్పటి ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్న కురసాల కన్నబాబు.

అప్పట్లో అంతలా చిరుకు సన్నిహితంగా ఉండి.. తర్వాత కాంగ్రెస్ లో పార్టీని కలిపేసిన తర్వాత.. జగన్ కు దగ్గర కావటం.. ఆయన పార్టీలోకి వెళ్లిపోయి.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. చిరు అన్నా.. ఆయన కుటుంబమన్నా విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే కన్నబాబు.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక బొత్స సత్తిబాబు కానీ.. ఒక కన్నబాబు కానీ.. ఇలా చాలామంది ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ ను కడిగేస్తున్నారు. తాజాగా అలాంటి పనే చేశారు కన్నబాబు. పవన్ పై ఆయన ఎంతలా విరుచుకుపడ్డారంటే..

- శ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేశారు. ఈ తరహా శ్రమదానం పవన్‌ ఒక్కరే చేయగలరేమో. వైసీపీపై యుద్ధం ప్రకటించానని పవన్‌ చెబుతున్నారు. ఏ కారణంతో ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నారో చెప్పాలి.

- కోవిడ్‌ సమయంలో పేదలను ఆదుకున్నందుకు యుద్దం చేయాలా? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం పెట్టింనందుకు యుద్దం చేయాలా? పేదరికంపై జగన్ యుద్ధం ప్రకటించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం.

- పవన్‌ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో కులాన్ని ఎజెండా చేస్తున్నామని ప్రకటించినట్టుగా ఉన్నారు. చంద్రబాబు తోడు లేకుండా పవన్‌ రాజకీయం చేయలేరు. రోడ్లు పూడుస్తామని చెప్పి కుల రాజకీయాలు చేశారు.

- ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై పవన్‌కు నమ్మకం లేదు. అందుకే ఉగ్రవాదులు మాట్లాడే వ్యాఖ్యలు చేస్తున్నారు.

- పవన్ కులాలు చూస్తున్నారు.మేం సంక్షేమం చూస్తున్నాం. రాష్ట్రంలో కులాల మధ్య సామరస్యత ఉందని, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి న్యాయం చేస్తున్నాం. కుల-మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కుల రాజకీయం చేసినవాళ్లు ఇంతవరకూ విజయం సాధించలేదు. పవన్‌ గోతులు పూడ్చడం కాదు.. గోతులు తీస్తున్నారు.