Begin typing your search above and press return to search.

కేవీపీ నిర‌స‌న‌కు కురియ‌న్ టంగ్ స్లిప్‌!

By:  Tupaki Desk   |   2 Feb 2018 8:52 AM GMT
కేవీపీ నిర‌స‌న‌కు కురియ‌న్ టంగ్ స్లిప్‌!
X
ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడ‌ట‌మే త‌ప్పైన‌ట్లుగా మారింది. విభ‌జ‌న‌లో జ‌రిగిన న‌ష్టాన్ని గ‌డిచిన నాలుగేళ్లుగా ఏ మాత్రం స‌రిదిద్ద‌ని మోడీ స‌ర్కారు.. తాజా బ‌డ్జెట్‌లోనూ మొండిచేయి చూపించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని.. పోల‌వ‌రం మొద‌లు విశాఖ రైల్వే ప్ర‌త్యేక జోన్ వ‌ర‌కూ ఏ అంశంలోనూ మోడీ స‌ర్కారు దృష్టి సారించిన‌ట్లుగా లేద‌నే చెప్పాలి.

దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లు ఏపీ నేత‌లు ప‌లువురు పెద‌వి విరిచారు. ఇక‌.. సామాన్యులైతే తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఏపీకి ఎంతో చేస్తామ‌ని.. దేశ రాజ‌ధాని ఢిల్లీకి త‌ల‌ద‌న్నే రాజ‌ధాని నిర్మాణానికి సాయం చేస్తామ‌ని.. ఏపీకి అండ‌గా నిలుస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చిన మోడీ.. ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఆ విష‌యాన్నే మ‌ర్చిపోయిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజా బ‌డ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపించ‌టంపై మండిప‌డుతున్న ఏపీ నేత‌ల‌కు భిన్నంగా.. రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామచంద్ర‌రావు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ రోజు (శుక్ర‌వారం) రాజ్య‌స‌భ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచే కేవీపీ ఒక్క‌రే ఏపీకి కాపాడాలంటూ ఫ్లకార్డు ప‌ట్టుకొని ఛైర్మ‌న్ వెల్ లోకి దూసుకెళ్లారు .ప్ల‌కార్డును అంద‌రికి క‌నిపించేలా ప్ర‌ద‌ర్శిస్తూ వెల్ లోనే ఉండిపోయారు.

ఆయ‌న్ను ఆయ‌న సీటు వ‌ద్ద‌కు వెళ్లి కూర్చోవాలంటూ రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ ప‌లుమార్లు కోరారు. అయిన‌ప్ప‌టికీ కేవీపీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. వెల్ లోనే నిలుచుండిపోయారు. ఈ నేప‌థ్యంలో కేవీపీని ప‌లుమార్లు ఆయ‌న సీట్లో కూర్చోవాలంటూ కురియ‌న్ కోరారు.అయిన‌ప్ప‌టికి కేవీపీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో స‌హ‌నం కోల్పోయిన కురియ‌న్.. కేవీపీని ఉద్దేశించి నోరు జారారు. ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు.

ఈయ‌న‌కు ఏమైంది. పిచ్చి ప‌ట్టిందా? అంటూ ఇంగ్లిషులో వ్యాఖ్యానించారు. ఓప‌క్క ఏపీకి నిధులు కేటాయించ‌ని మోడీ స‌ర్కారుపై ఆంధ్రోళ్లు మండ‌పోతున్న వేళ‌.. రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ హోదాలో ఉన్న కురియ‌న్ ఈ తీరులో ఒక ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీని ఉద్దేశించి నోరు జార‌టం సంచ‌ల‌నంగా మారింది.