Begin typing your search above and press return to search.

సిపిఐ రామకృష్ణ కి షాక్ ఇచ్చిన కర్నూల్ !

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:42 AM GMT
సిపిఐ రామకృష్ణ కి షాక్ ఇచ్చిన కర్నూల్ !
X
కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంత నిబద్ధత గల పార్టీలని చాలామంది అభిప్రాయం. ఇతర బూర్జువా పార్టీల మాదిరిగా అవి వ్యవహరించవని చెబుతారు. ఏదైనా ప్రధాన అంశంపై రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఒక తీర్మానం చేస్తే లేదా నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా అందరూ తప్పని సరిగా పాటిస్తారు. ఇతర పార్టీల్లో నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతుంటారు. కాని కమ్యూనిస్టు పార్టీల్లో అలా ఉండదు. పార్టీ విధానాలపై రాష్ట్ర కార్యదర్శి, జాతీయ స్థాయిలో జాతీయ కార్యదర్శి మాట్లాడతాడు.

ఏపీలో మూడు రాజధానులు రచ్చ మొదలైనప్పటినుంచి సీపీఐ అమరావతికి కట్టుబడి ఉంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లో సాగుతున్న రైతుల ఉద్యమం లో రామకృష్ణ చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న కార్యక్రమాల్లో కనబడుతున్నారు. అప్పుడప్పుడు టీవీ చర్చల్లో పాల్గొంటూ అమరావతి ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు.

పార్టీ జాతీయ నేత డాక్టర్‌ నారాయణ కూడా అమరావతి కి అనుకూలం గా జరుగుతున్న ఉద్యమం లో పాల్గొంటున్నారు. జగన్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమరావతిని సమర్ధించడమనేది పార్టీ విధానం. దానికి అనుగుణం గానే పార్టీ కారాచరణ ఉంది. రాజధాని అమరావతి లోనే ఉంచి అభృవృద్ధి ని వికేంద్రీకరణ చేయాలని చెబుతున్నారు. మూడు రాజధానుల వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు. అయితే , సోమవారం సీపీఐ రామకృష్ణ కు ఊహించని షాక్ తగిలింది. అమరావతి రాజధానికి మద్దతిస్తున్న రామకృష్ణ అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ వాసుల డిమాండ్‌ను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. సీపీఐ కర్నూలు జిల్లా కమిటీ తీర్మానం చేసింది. రామకృష్ణ తీరుపై కర్నూలు సీపీఐ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కమిటీ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపిస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు.