Begin typing your search above and press return to search.

కోర‌కుండానే ఎంపిక చేస్తే నా త‌ప్పేంటి: బుట్టా

By:  Tupaki Desk   |   13 Feb 2018 4:36 AM GMT
కోర‌కుండానే ఎంపిక చేస్తే నా త‌ప్పేంటి:  బుట్టా
X
త‌ప్పేం లేకున్నా అన‌ర్హ‌త వేటు ప‌డనుందంటూ క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్య‌వ‌హారం ప్ర‌చార మాధ్య‌మాల్లో హోరెత్తిన వైనం తెలిసిందే. ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తూ.. లాభ‌దాయ‌క ప‌ద‌విని ఆమె అనుభ‌విస్తున్నార‌న్న ఆరోప‌ణ ఆమెపై ఉంది. ఇంత‌కీ ఈ వ్య‌వ‌హారంలో బుట్టా త‌ప్పు ఉందా? ఆమె ప్ర‌మేయం ఏమీ లేకుండానే.. ఆమె త‌ప్పు చేశారంటూ తేల్చేసిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ బుట్టా మీద ఉన్న ఆరోప‌ణ ఏమిట‌న్న‌ది చూస్తూ.. కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు జ‌న‌ర‌ల్ బాడీ స‌భ్యుల్లో బుట్టా రేణుక ఉన్నార‌ని.. ఎంపీగా ఉంటూ.. మ‌రో లాభ‌దాయ‌క ప‌ద‌విని అనుభ‌వించ‌ట‌మేన‌ని చెబుతోంది పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డులో ఒక ఛైర్ ప‌ర్స‌న్‌.. వివిధ రంగాల ప్ర‌ముఖులు.. ప్ర‌భుత్వ అధికారులు ఉంటారు. అయితే.. ఇందులో బుట్టా ఎంట్రీ ఎలా జ‌రిగింది? ఆమె కోరుకుంటే ఈ ప‌ద‌వి ఇచ్చారా? లేక‌.. ప్ర‌భుత్వ‌మే ఆమెను నియ‌మించిందా? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

త‌న‌ను బోర్డులో నియ‌మించింది ప్ర‌భుత్వ‌మేన‌ని.. తాను కానీ.. త‌న పార్టీ కానీ బోర్డులో నియ‌మించాల‌ని కోర‌లేద‌ని.. అలాంట‌ప్పుడు అన‌ర్హ‌త వేటు ఎలా వేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు బుట్టా. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం సిఫార్సు చేసిన సంగ‌తి త‌న‌కు తెలీద‌ని ఆమె చెబుతున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై ఒక మీడియా సంస్థ‌తో మాట్లాడిన బుట్టా.. జ‌న‌ర‌ల్ గా ప్ర‌తి బోర్డులో ఇద్ద‌రు ఎంపీల‌ను ప్ర‌భుత్వ‌మే నియ‌మిస్తుంద‌ని.. బోర్డు జీత‌భ‌త్యాలు ఏమీ చెల్లించ‌ద‌ని చెప్పారు. గ‌తంలో త‌న‌ను జూట్ బోర్డులో అపాయింట్ చేశార‌ని.. ఈ మ‌ధ్య‌న ఆరోగ్య శాఖ‌కు సంబంధించిన బోర్డులో మెంబ‌ర్ గా నియ‌మించిన‌ట్లు చెప్పారు. త‌న ప్ర‌మేయం లేకుండా త‌న‌ను నియ‌మిస్తే త‌న త‌ప్పేం అవుతుంద‌న్న బుట్టా వాద‌న‌లో నిజం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. బుట్టా ప్ర‌మేయం లేకుండా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి క‌ర్నూలు ఎంపీపై అన‌ర్హ‌త వేటు ఎందుకు వేస్తున్న‌ట్లు..? అన్న క్వ‌శ్చ‌న్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.