Begin typing your search above and press return to search.

భావోద్వేగంతో ఊగిపోతున్న కర్నూలు

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:08 AM GMT
భావోద్వేగంతో ఊగిపోతున్న కర్నూలు
X
అందరి కోసం కొద్ది మంది చేసే త్యాగాలు చాలా సందర్భాల్లో ఫోకస్ కావు. చరిత్ర ఎంతసేపటికి తమకు అన్యాయం జరిగిందని.. ద్రోహం జరిగిందంటూ విరుచుకుపడే వారి మీదా..ఆ వాదనను తెర మీదకు తీసుకొచ్చన వారికిచ్చిన ప్రాధాన్యత.. అందరి కోసం తమకున్న ప్రయోజనాల్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యేవారు చాలా తక్కువగా ఉంటారు. పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. రాజధానినగరంగా ఉండాల్సిన కర్నూలు.. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంధప్రదేశ్ గా అవతరించే సందర్భంలో రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు ప్రజలు చేసిన త్యాగానికి సరైన గుర్తింపు దక్కలేదని చెప్పాలి.

మూడేళ్ల పాటు రాజధానిగా ఉంటూ.. బోలెడన్ని భవిష్యత్ కలలు కంటున్న వేళ..అందుకు భిన్నంగా రాజధానిని హైదరాబాద్ కు మార్చిన వైనాన్ని మర్చిపోలేం. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజధాని నగరంగా కర్నూలును ప్రకటించటం తెలిసిందే. అక్కడ హైకోర్టును ఏర్పాటు చేస్తామన్న మాట జగన్ నోట వచ్చింది.

దీంతో.. కర్నూలు జిల్లా వాసులు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని జగన్ చెప్పిన మాటను స్వాగతిస్తూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి రాజధానిని ఇవ్వకున్నా ఫర్లేదు కానీ కనీసం హైకోర్టు ఇవ్వాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించినా.. చంద్రబాబు దాన్ని పక్కన పెట్టేశారు.

అందుకు భిన్నంగా సీఎం జగన్ మాత్రం కర్నూలును రాజధాని నగరాల్లో ఒకటిగా ప్రకటించటంతో ఆ జిల్లా వాసులు ఇప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురి కావటమే కాదు.. అప్పుడెప్పుడో చేసిన త్యాగానికి ఇప్పటికి ఫలితం దక్కిందా? అని మాట్లాడుకోవటం కనిపించింది. రాజధాని నగరాన్ని వదులుకున్న కర్నూలుకు న్యాయం జరుగుతుందని ఆ జిల్లా ప్రజలు భావించారు. కానీ.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ కర్నూలును పట్టించుకున్నదే లేదు. దశాబ్దాల పర్యంతం చోటు చేసుకున్న అన్యాయానికి చెక్ చెబుతూ.. కర్నూలును ఏపీ రాష్ట్ర రాజధాని నగరాల్లో ఒకటిగా ప్రకటించి న్యాయం చేశారన్న అభిప్రాయం పలువురి నోట వినిపించటం గమనార్హం.