Begin typing your search above and press return to search.

కర్నూలు వైసీపీ ఎంపీకి సైబర్ నేరస్తుడి టోకరా.. 'రూ.లక్ష' ఏసేశాడు

By:  Tupaki Desk   |   4 May 2022 7:03 AM GMT
కర్నూలు వైసీపీ ఎంపీకి సైబర్ నేరస్తుడి టోకరా.. రూ.లక్ష ఏసేశాడు
X
గతంలో ఇంట్లో దొంగలు పడ్డారనే మాట తరచూ వింటుండేవాళ్లం. మారిన కాలానికి తగ్గట్లుగా ఇప్పుడు కొత్త తరహా దొంగలు దోచేస్తున్నారు. కంటికి కనిపించకుండా.. ఎదుటి వారి అమాయకత్వాన్ని అసరా చేసుకొని దోచేస్తున్నారు. కొందరి బలహీనతలతో ఆడుకుంటూ వారి కష్టాన్ని తెలివిగా దోచేస్తున్నారు. గతంలో అంత అవగాహన లేకున్నా.. గడిచిన కొంతకాలంగా మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటీపీని చెప్పకూడదని.. తెలీని నెంబర్ల నుంచి వచ్చే లింకుల్ని టచ్ చేయకూడదన్న అంశాలపై చాలామందికి అవగాహన ఉంది.

అన్నింటికి మించి బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ.. వివరాలు తెలుసుకొని.. అకౌంట్లో ఉన్న డబ్బుల్ని దోచేసే వారి దందా ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి వారి చేతికి చిక్కిన సామాన్యులు భారీగా నష్టపోతుంటారు. ఆ జాబితాలోకి చేరారు కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్. ఒక ఎంపీ అయి ఉండి.. కనీస అవగాహన లేని వ్యక్తిలా వ్యవహరించిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.

తాజాగా ఆయనకో సైబర్ నేరగాడి నుంచి ఫోన్ కు.. "మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందని.. వెంటనే పాన్ నెంబరుతో జత చేసి అప్డేట్ చేసుకోవాలని ఒక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత లింకు వచ్చింది. దీంతోనమ్మిన ఎంపీ సంజీవ్ కుమార్ ఆ లింకులోని వివరాల్ని నమోదు చేసి పంపారు.

దానికి ఓటీపీ నంబర్లు వచ్చాయి. కాసేపటికే అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తనను తాను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని.. వివరాలు అడగటంతో పాటు.. ఓటీపీ నెంబర్లను అడిగి తెలుసుకున్నారు.

అపరిచితుడు అడిగిన వెంటనే అన్ని వివరాల్ని ఇచ్చేసిన ఎంపీగారికి దాని ఫలితం కనిపించింది. ఆయన ఖాతా నుంచి రూ.48,700 ఒకసారి.. మరోసారి రూ.48,999 డ్రా అయినట్లుగా ఫోన్ కు సమాచారం అందింది.

దీంతో కంగారుపడ్డ ఆయన బ్యాంకుకు ఫోన్ చేయగా.. తాను మోసపోయినట్లుగా గుర్తించారు. దీంతో.. తనను సైబర్ నేరస్తుడు రూ.97,669 తన ఖాతా నుంచి దొంగలించినట్లుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయినా.. ఒక ఎంపీ అయి ఉండి బ్యాంకు బ్లాక్ అయ్యిందన్నంతనే.. పీఏను పిలిచి.. మేనేజర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలి కదా? అదేమీ లేకుండా ఇంత సింఫుల్ గా మోసపోవటం ఏమిటి?