Begin typing your search above and press return to search.

కర్నూలు వైసీపీలో సెగలు.. పొగలు.?

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:17 AM GMT
కర్నూలు వైసీపీలో సెగలు.. పొగలు.?
X
రాజకీయ పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు రావడం సహజం. అయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు సయోధ్యతో వెళితే లాభం ఉంటుందన్న విషయం కొందరు మరిచిపోతారు. పౌరుషాలకు పోతు ఆధిపత్య పోరు కోసం విభేదాలు తెచ్చుకొని కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ఇప్పుడు వైసీపీ స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. దీంతో ఇతర పార్టీలో ఉన్న నాయకులందరూ వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో కొందరు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కన బెట్టి పార్టీ గెలుపుకోసం కృషి చేశారు. కానీ కర్నూలు వైసీపీలోని ముఖ్య నేతలు హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య విభేదాలు వీధికెక్కాయి. కర్నూలు వైసీపీలో ఆధిపత్యపోరును రాజేశాయి.

2019 ఎన్నికల సమయంలో టికెట్ దక్కించుకున్నహఫీజ్ ఖాన్ తనకు సహకరించాలని ఎస్వీ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ప్రాధేయపడ్డారు. అయితే ఎన్నికల ప్రచారంలోనే వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఎస్వీని ఎమ్మెల్యే దూరం పెడుతూ వస్తున్నారు. ఒకానొక సందర్భంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే ఎస్వీపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సొంత పార్టీలోనే ఇలా ప్రత్యర్థులు ఉండడాన్ని పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు నాయకులు చేష్టలతో అయోమయానికి గురవుతున్నారు. ఈ విభేదాల కారణంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లుగా పోటీ చేసిన కొందరు వైసీపీ నాయకులు ఓడిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన పార్టీ పెద్దలు సయోధ్య కోసం జిల్లా ఇన్ చార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణను పంపించారు. అయితే ఇరు వర్గాలకు కూర్చోబెట్టి మాట్లాడినా పరిస్థితి మారలేదు.

తాజాగా పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇద్దరి మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు ఓల్డ్ సిటీలో ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు జెండావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే పార్టీ నాయకులతో చర్చించారు. దీంతో కార్పొరేటర్, మరికొందరు నాయకులు కలిసి ఎస్వీ మోహన్ రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్వీ వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. జెండావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఈ వివాదం అధిష్టానానికి చేరుకోవడంతో ఇరువర్గాలను ఈ విషయంపై సంప్రదించగా ఎవరికి వారే వాదించారట. ఎమ్మెల్య హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ తనను పిలవక పోయినా స్థానిక కార్పొరేటర్ ను పిలవాలి కదా.. అని చెప్పారట. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం జెండా పండుగకు కూడా ఎమ్మెల్యేలను పిలవాలా..? అని వాదించుకున్నారట. ఇలా ప్రతీసారి ఎదో ఒక వివాదంతో కర్నూలు జిల్లా వైసీపీలో విభేదాలు రోడ్డున పడుతున్నాయి.

ఇప్పటికే కొన్ని చోట్ల విభేదాలతో పార్టీ పరువు పోతుందని, ఇలా ఇరు నాయకుల విభేదాలు ఇలా సాగితే రాను రాను మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం కల్పించుకొని విభేదాలను తొలగింప చేయాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం మరింతగా పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇద్దరు నాయకుల్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరికి సమన్యాయం చేసే విధంగా అధిష్టాన పెద్దలు సంధి కుదుర్చాలని కార్యకర్తలు కోరుతున్నారు. మరి అధిష్టానం ఈ విభేదాలను ఎలా పరిష్కరిస్తుందో చూడలి.