Begin typing your search above and press return to search.

జయ కేసు: కుష్బూ ప్రశ్నలు, పిపీ షాక్ లు!

By:  Tupaki Desk   |   12 May 2015 10:41 AM GMT
జయ కేసు: కుష్బూ ప్రశ్నలు, పిపీ షాక్ లు!
X
కర్ణాటక హైకోర్టు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను నిర్ధోషిగా ప్రకటించినప్పటి నుండీ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి! ఇది సరైన తీర్పని, అమ్మ బయటకు వస్తారని మాకు ముందే తెలుసని, జయ విడుదల కావాలని పూజలు చేసిన అభిమానులు, కార్యకర్తలు అంటుంటే... ఇది సరైన తీర్పు కాదని, చట్టం ఇలా కూడా పనిచేస్తుందా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు! ఈ క్రమంలో సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ కూడా కర్ణాటక హైకోర్టు తీర్పులో జయలలిత నిర్ధోషిగా విడుదలవ్వడంపై స్పందించారు!
తాను ఎలాంటి తప్పు చేయలేదనే ధైర్యంతో జయలలిత నిద్రపోగలరా అని కుష్బూ ప్రశ్నిస్తున్నారు! ఎవరు ఏ తప్పు చేసినా ఎవ్వరికి సమాధానం చెప్పలేకపోయినా... తమ అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలని, అప్పుడే ప్రశాంతంగా నిద్రపోగలమని, అటువంటి నిద్ర జయలలితకు సాధ్యం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు కుష్బూ!
ఇదే సమయంలో వాదించే అవకాశం కాని, స్పందించే సమయం కానీ తనకు ఇవ్వలేదని జయలలిత కేసు కు సంబందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య వ్యాఖ్యానించారు! ఈ కేసులో కోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదని, జయ అప్పీల్‌పై అభ్యంతరాల దాఖలుకు ఒక్కరోజే గడువిచ్చారని, అది సరిపోలేదని, దీంతో తమకు వాదించే అవకాశమే కల్పించలేనట్లయ్యిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపిస్తున్నారు!
ఈ విషయంలో సమగ్ర విచారణ ఏజన్సీ అని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు, అధికారం ఇచ్చినా కూడా కర్ణాటక ప్రభుత్వానికి గానీ, ఆ ప్రభుత్వం నియమించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తనకు గానీ మౌఖికంగా వాదించే అవకాశాన్ని కోర్టు కల్పించలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాంబు పేల్చారు! జయలలిత తరఫు న్యాయవాదులు వాదించేటప్పుడు కర్ణాటక ప్రభుత్వం తరఫున అభ్యంతరాలు చెప్పేవారు ఎవరూ లేరని ఆచార్య ఆశ్చర్యపోయే విషయలు చెప్పారు!